అమరావతి
18.4.2020
దివంగత కె.చంద్రమౌళి కి వైఎస్ఆర్ సిపి ఎంపిల నివాళి
వైయస్ఆర్ సీపీ నాయకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి పార్థివ కాయాన్ని వై ఎస్ ఆర్ సి పి రాజంపేట, చిత్తూరు పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రెడ్డప్పలు సందర్శించారు. మృతదేహం వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. హైదరాబాదులోని చంద్రమౌళి నివాసంకు వెళ్లిన ఎంపిలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి చేసిన కే. చంద్రమౌళి బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా, బలహీన వర్గాల ప్రజలకు ఎంతో సేవ చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. సివిల్ సర్వెంట్ గా పలు జిల్లాల్లో పనిచేసిన సందర్భంలోనూ కే. చంద్రమౌళి ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు చేరువ చేయడంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారిగా అటు ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతూ అనునిత్యం ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే ఆయన పనిచేశారని అన్నారు. ఐఎఎస్ అధికారిగా తన పదవీ విరమణ తరువాత వైఎస్ఆర్సిపి ద్వారా కుప్పం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన కృషి చేశారని కొనియాడారు. చంద్రమౌళి మరణం చిత్తూరు జిల్లాకి తీరనిలోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం*
వైఎస్ఆర్ సిపి కుప్పం నియోజక ఇన్ చార్జి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.చంద్రమౌళి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఆయన వైఎస్ఆర్సిపిలో ప్రధాన భూమిక పోషించారని, ఆయన మరణం జిల్లావాసులకు తీరని లోటని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ధైర్యంగా నిలబడిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఐఏఎస్ అధికారిగా ఆయన అందించిన సేవలు సైతం ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారని, ఆయన మరణం బాధాకరమని ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.