సలహాదారు పదవులకు సెలవు?

సలహాదారు పదవులకు సెలవు?
వలంటీర్ల వ్యవస్థకూ మంగళం?
ఆర్ధిక భారం తప్పించేందుకేనా?
విపక్షాల విమర్శలకు తెర
జగన్ సంచలన నిర్ణయం?
ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఖజానాను గట్టెక్కించేందుకు,   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా.. ఖజానాకు భారంగా పరిణమించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, వలంటీర్ల వ్యవస్థను తొలగించనున్నట్లు సమాచారం. ఫలితంగా వేల కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం. ఒక అధికారి ఇచ్చిన సలహా మేరకు జగన్మోహన్‌రెడ్డి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకముందు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంత సంతృప్తికరంగా కాకపోయినా, ఓ మోస్తరు ఆదాయం ఉండేది. ప్రధానంగా లిక్కర్ నుంచి అధిక ఆదాయం లభించేది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్‌షాపులు రద్దు చేసి, ప్రభుత్వమే లిక్కర్‌షాపులు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటుచేసింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి, ఇప్పటివరకూ  దాదాపు 38 మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. అదేవిధంగా 2,39,159మందిని వలంటీర్లుగా నియమించారు. వీరి జీతభత్యాలకు వేల కోట్లు ఖర్చవుతున్నాయి. సలహాదారులకు నెలకు, 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. వీరిలో ఎక్కువగా రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నారు. వీరి జీతభత్యాలు, వారి వద్ద పనిచేసే ఉద్యోగుల వేతనాలకు, సుమారు కోటిన్నర వరకూ ఖర్చవుతోంది. అయితే నిజానికి వీరు ఇస్తున్న సలహాలు గానీ, వాటిని జగన్మోహన్‌రెడ్డి పాటిస్తున్న దాఖలాలు గానీ లేవు. ఎంతోమంది సలహాదారులున్నప్పటికీ.. సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్‌కల్లం, పి.వి.రమేష్ వంటి అతికొద్దిమంది మాత్రమే చురుకుగా పనిచేస్తున్నారు.
అయితే, ఇటీవలే ఎయిమ్స్‌లో పనిచేసే డాక్టర్ శ్రీనాధ్‌రెడ్డికి ఎలాంటి జీతం లేకుండా, ఉచిత సేవలందిస్తున్నందుకు ఆయనను వైద్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వు లిచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్ధిక భారం పడదు. దీనికి సంబంధించి ఒక ఉన్నతాధికారి.. జగన్మోహన్‌రెడ్డికి సలహాదారుల వేతనాలపై ఒక సూచన చేసినట్లు సమాచారం. ఆ ప్రకారంగా.. ప్రస్తుతం ఉన్న సలహాదారులను తొలగించడం గానీ, లేదా డాక్టర్ శ్రీనాధ్‌రెడ్డి మాదిరిగా ఉచిత సలహాలు ఇస్తూ సలహాదారులుగా కొనసాగాలా అన్న విషయాన్ని వారికే విడిచిపెట్టాలని, సదరు అధికారి జగన్మోహన్‌రెడ్డికి సూచించినట్లు చెబుతున్నారు. నిజంగా సలహాదారులకు వేతనాలు లేకుండా, కొనసాగించడం వల్ల ఖజానాకు కోట్లాది రూపాయలు మిగులుతాయంటున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 2,39,159 మంది వలంటీర్లను కూడా తొలగించడం ద్వారా, వేయి కోట్ల రూపాయల ఆర్ధిక భారం తప్పుతుందని సదరు అధికారి, జగన్మోహన్‌రెడ్డికి సూచించినట్లు సమాచారం. గ్రామ వలంటీర్లకు 720 కోట్లు, మున్సిపల్ వలంటీర్లకు 280 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. నిజానికి వీరి వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండటం లేకపోగా, ప్రభుత్వం-పార్టీ అనవసర ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తోందటున్నారు. కరోనా నేపథ్యంలో రేషన్‌కార్డులు ఉన్నవారికి, ఇంటికే రేషన్ పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. అయితే, అది సాధ్యం కాదని మంత్రి కొడాలి నాని చెప్పడం గందరగోళానికి దారి తీసింది. ప్రతిపక్షాలు కూడా వలంటీర్లకు నెలకు 5 వేల రూపాయలు ఇస్తున్నప్పుడు, గతంలో జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లు.. వారి ద్వారా, రేషన్ ఎందుకు పంపిణీ చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అదీ కాకుండా వలంటీర్లపై స్థానికంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని తొలగించడం వల్ల, ఖజానాపై వేయి కోట్ల భారం తగ్గిపోతుందని సదరు అధికారి జగన్మోహన్‌రెడ్డికి వివరించినట్లు సమాచారం. అదీకాకుండా.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలు, చివరకు పెన్షనర్లు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులలో కూడా కోత విధించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం వద్ద 30 వేల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉద్యోగుల జీతాల్లో కోత ఎందుకు విధించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే మెగా కృష్ణారెడ్డి కంపెనీ, మరో కంపెనీకి 6400 కోట్లు ఎలా చెల్లించారని.. ఉద్యోగులకు ఇవ్వడానికి లేని డబ్బులు, కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఎలా వస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి  లోకేష్  నిలదీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టేంత స్థాయిలో,  ఖజానాలో డబ్బు లేని క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు.. ఖజానాకు భారంగా మారిన సలహాదారులు, వలంటీర్ల వ్యవస్థను తొలగించడమే మంచిదని సదరు అధికారి, జగన్మోహన్‌రెడ్డికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. వీటిని రద్దు చేయడం వల్ల మిగిలే నిధులను, ఇతర అత్యవసర కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే చిన్న స్థాయి కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.  పైగా సలహాదారుల నియామకాలపై ఇప్పటికే నలుచెరుగులా విమర్శలు వస్తున్నందున, ఈ నిర్ణయంతో వాటికీ తెరదించవచ్చని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఈ విషయంలో ప్రతిష్ఠకు వెళితే.. డాక్టర్ శ్రీనాధరెడ్డి మాదిరిగా, ఉచితంగా సేవలందించేందుకే సలహాదారులను పరిమితం చేస్తే, కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని చెప్పినట్లు వినికిడి.  దీనిపై జగన్మోహన్‌రెడ్డి సానుకూలంగానే స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది.