జర్నలిస్టులు విధులలో అప్రమత్తంగా ఉండండి : వింజమూరు యం.పి.డి.ఓ.

*జర్నలిస్టులు విధులలో అప్రమత్తంగా ఉండండి :వింజమూరు యం.పి.డి.ఓ


.వింజమూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని వింజమూరు యం.పి.డి.ఓ ఎస్.కనకదుర్గా భవానీ కోరారు. కోవిడ్-19 నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి నేటికి నెల రోజులు పూర్తవుతుందన్నారు. ఈ రోజులన్నింటిలో కూడా సమాచార వ్యవస్థను పెంపొందించేందుకు జర్నలిస్టులు చేసిన కృషి అభినందనీయమన్నారు. కరోనా నివారణకు గానూ జర్నలిస్టులు తమ వంతు భాధ్యతలను నిర్వహిస్తూ అధికారులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల శ్రేయస్సు కోరుతూ ఇప్పటికే వారికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, వాటర్ బాటిళ్ళు అందజేస్తున్నామన్నారు. వార్తల సేకరణలో పోటీతత్వం ఉండటం సహజమేనని, అయితే ఈ కరోనా వైరస్ సమయంలో ఏ ప్రాంతాలకు వెళ్ళినా తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను వినియోగించడం విధిగా భావించాలన్నారు. నిరంతర సేవలలో మునిగితేలుతున్న జర్నలిస్టులకు అవసరమైన మెటీరియల్ అందించేందుకు తాము అన్నివేళలా సిద్ధంగా ఉన్నామన్నారు. వింజమూరు మండలాన్ని గ్రీన్ జోన్ పరిధిలోకి తెచ్చేందుకు కరోనా నియంత్రణ బృందం సభ్యులు అహర్నిశలూ శ్రమించారని, అందులో జర్నలిస్టుల సహకారం కూడా ఉందన్నారు. కనుక మండలంలో పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటున్న విలేకరులు తగు జాగ్రత్తలు వహిస్తూ సమదూరం పాటిస్తూ న్యూస్ కవరేజ్ చేసుకోవాలని సూచించారు. వారి వారి కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం చేసే సమయాలలో సెల్ ఫోన్ వాడకమును తగ్గించుకోవాలన్నారు. అత్యవసర  సమయాలలో వారు ప్రయాణించే వాహనాలను రోడ్డు మీద నుండి మార్జిన్లులోకి దించి నిలిపివేసి సురక్షిత ప్రదేశాలను ఎంచుకుంటూ విధులు నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమాజ సేవకులుగా విలేకరులు అందిస్తున్న సేవలు అజరామరమని, ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా అత్యంత జాగ్రత్తలు వహించాలని యం.పి.డి.ఓ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు , ముంబై ప్రాంతాలలో పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడటం శోచనీయమని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.