శ్రీసిటీలో రాష్ట్ర ప్రభుత్వాధికారులు, పరిశ్రమల ప్రతినిధుల సమావేశం 

శ్రీసిటీలో రాష్ట్ర ప్రభుత్వాధికారులు, పరిశ్రమల ప్రతినిధుల సమావేశం
- చిత్తూరు, నెల్లూరు, తిరువళ్లూరు ఎస్పీలు హాజరు 
- ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశ్రమలకు అన్నివిధాలా సహకరిస్తామన్న అధికారులు


శ్రీసిటీ, ఏప్రిల్ 13, 2020:


కరోనా మహమ్మారిని నిలువరించడానికి అధిక ప్రాధాన్యమిస్తూనే, ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశ్రమలు నడిపేందుకు తాము అన్నివిధాలా సహకరిస్తామంటూ శ్రీసిటీ పరిసర జిల్లాల ఎస్పీలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనలమేరకు  ప్రభుత్వాధికారులు , పరిశ్రమల ప్రతినిధుల సమావేశం సోమవారం ఉదయం శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో నిర్వహించారు. ఇందులో శ్రీసిటీ సెజ్ డెవలప్మెంట్ కమీషనర్ ముత్తురాజ్, చిత్తూరు ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్, నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్, తిరువళ్లూరు (తమిళనాడు) ఎస్పీ అరవిందన్, తిరుపతి ఆర్ డీ ఓ కనకనరసారెడ్డి, నాయుడుపేట  ఆర్ డీ ఓ సరోజినీ, శ్రీసిటీ డీఎస్పీ విమలాకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వీరికి సాదరస్వాగతం పలికారు. 


సమావేశంలో ప్రధానంగా, కరోనా దేశవ్యాప్త లాక్ డౌన్ సమయంలో శ్రీసిటీలోని ఆహార, ఔషధ, ప్యాకేజింగ్ రంగానికి చెందిన సుమారు 30 పరిశ్రమలకు అనుమతులుప్పటికీ, రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల వద్ద తాము పలు సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ పరిశ్రమల ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు. మరోవైపు కొన్నిశ్రీసిటీ పరిసర గ్రామాల్లో కంపెనీలకు ఉద్యోగులు రాకుండా అడ్డుకుంటున్నారని, మరికొన్ని గ్రామాల్లో రోడ్లుకు అడ్డంగా కంచెలు వేసి రాకపోకలను అడ్డుకోవడం జరుగుతోందని వాపోయారు. దీనిపై ఎస్పీలు స్పందిస్తూ, పరిశ్రమ వర్గాల ఇబ్బందులు తెలగిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పరిశ్రమల సరకు రవాణా వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే ఉద్యోగుల రవాణా వాహనాలపై కొన్ని ఆంక్షలు తప్పవన్నారు. ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతుల మేరకు ఉద్యోగులను, వాహనాలను అనుమతించడం జరుగుతుందన్నారు. పేర్లు, వివరాలు ఇస్తే సంబంధిత వాహనాలు, ఉద్యోగులకు పాసులు జారీ చేస్తామన్నారు. అయితే వాహనాల్లో విధిగా డిసిన్ఫెక్షన్ చర్యలతో పాటు శానిటైసర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు. సామాజిక దూరం పాటించాలని, వారానికోసారి ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రిపోర్ట్ కార్డులు జారీ చేయాలని, ప్రతి కంపెనీలోను తాత్కాలిక ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శ్రీసిటీ చిత్రమైన సరిహద్దు కలిగివుందని, పరిశ్రమలన్నీ చిత్తూరు జిల్లాలో ఉన్నప్పటికీ, ప్రధాన ప్రవేశ ద్వారం నెల్లూరు జిల్లాలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన చోట్ల సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. సమస్యల పరిష్కారాల కోసం కొత్తగా జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ కాల్ సెంటర్లకు ఫోన్ చేయాలని చిత్తూరు, నెల్లూరు జిల్లా ఎస్పీలు తెలిపారు. అయితే రెడ్ జోన్లలో ఉద్యోగుల కదలికలపై ఆంక్షలు కఠినంగా వుంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమల ఉద్యోగుల రాకపోకలకు గ్రామస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను తెలిగించేందుకు తగు చర్యలు చేపడతామంటూ తిరుపతి, నాయుడుపేట ఆర్ డీ ఓ లు పేర్కొన్నారు. 


సెజ్ డీసీ ముత్తురాజ్ మాట్లాడుతూ, పరిశ్రమల యాజమాన్యాల అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వ చొరవను ప్రస్తావిస్తూ, ఉత్పత్తులు ప్రారంభించాలన్న పరిశ్రమలు ఆయా జిల్లా కలెక్టర్ల నుండి అనుమతి తీసుకోవాలని మరియు అన్ని షరతులు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. 


శ్రీసిటీ పరిశ్రమలకు తగు సహకారం అందించేందుకు చొరవ చూపుతూ శ్రీసిటీ సమావేశానికి హాజరైన ఎస్పీలకు, ఇతర అధికారులకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ యాజమాన్యం తరపున పరిశ్రమ వర్గాలకు సాయంగా శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లోను ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేకుండా శ్రీసిటీ గ్రీన్ జోన్ లో వుందని, పరిశ్రమవర్గాలు మరింత భాద్యతగా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనాను దరిచేరనియ్యకుండా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.


01 - శ్రీసిటీ చేపట్టిన కరోనా నివారణ చర్యలను అధికారులకు వివరిస్తున్న శ్రీసిటీ ఎండీ 
02 - సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీసిటీ డీసీ, ఎస్పీలు చిత్తూరు, నెల్లూరు, తిరువళ్లూరు 
03, 04, 05 - సమావేశం దృశ్యాలు