రేపటి (16వ తేదీ)నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ.

15.5.2020
అమరావతి


- రేపటి (16వ తేదీ)నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ.


- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది.


- రాష్ట్రంలో బియ్యంకార్డు వున్న కుటుంబాలు 1,47,24,017


- కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862


- కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు.


- కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి


- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటు.


- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు 


- రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు.


- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాలకు రద్దీని బట్టి అదనపు కౌంటర్లు


కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న ఆంక్షల వల్ల పనులు చేసుకోలేని పేదలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం చేసింది. శనివారం (మే 16వ తేదీ) నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రతి బియ్యంకార్డుకు కేజీ శనగలు, కార్డులోని ప్రతి సభ్యుడికి అయిదు కేజీల చొప్పున బియ్యంను ఉచితంగా అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు జిల్లాల్లోని 28,354 చౌకదుకాణాల ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు అందించనున్నారు. అర్హత వుండి, బియ్యంకార్డు లేని పేద కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్ అందించాలంటూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో కొత్తగా 81,862 కుటుంబాలకు మూడో విడత నుంచి ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అర్హులైన ఈ పేద కుటుంబాలకు ఉచిత రేషన్ అందిస్తున్నారు.  దీంతో నాలుగో విడతలో మొత్తం  1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే సివిల్ సప్లయిస్ అధికారులు అన్ని చౌకదుకాణాలకు బియ్యం, శనగలు రవాణా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతికదూరంను పాటించాలన్న నిబంధనల మేరకు, రేషన్ దుకాణాల వద్ద గుంపులుగా ఏర్పడకుండా వుండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. కొన్నిచోట్ల రేషన్ కోసం కార్డుదారులు తొందరపడి ఒకేసారి దుకాణాల వద్దకు వచ్చిన పరిస్థితిని గమనించి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా సమయం, తేదీతో కూడిన కూపన్లను ముద్రించింది. వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను బియ్యంకార్డుదారులకు అందిస్తున్నారు. ఈ కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్ లో ఏ తేదీలో, ఏ సమయానికి వారు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చో నిర్ధేశిస్తున్నారు. 


*రేషన్ కార్డు దారులు గొడుగులు ఉపయోగించాలి: కోన శశిధర్*
ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా భౌతికదూరంను ఖచ్చితంగా పాటించడానికి, మరోవైపు వేసవిలో తీవ్రంగా వున్న ఎండల నుంచి కూడా రక్షణ పొందేందుకు చౌకదుకాణాల వద్దకు వచ్చే కార్డుదారులు గొడుగులు ఉపయోగించాలని సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు. గొడుగు వేసుకోవడం వల్ల వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఖచ్చితమైన దూరం వుంటుందని, అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ నుంచి కూడా రక్షణ లభిస్తుందని ఈ సందర్బంగా ఆయన సూచించారు. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న సరుకుల విషయంలో మూడో విడత మాదిరిగానే బయోమెట్రిక్ ను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా చౌక దుకాణాల వద్ద శానిటైర్లను అందుబాటులో వుంచుతున్నామని, ప్రతి కార్డుదారుడు రేషన్ తీసుకునే ముందు, ఆ తరువాత కూడా రేషన్ కౌంటర్ల వద్ద  చేతులను శానిటైజ్ చేసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే రేషన్ డీలర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే ఎక్కువ మంది ఒకేసారి సరుకుల కోసం రాకుండా గతంలో మాదిరిగానే రేషన్ కార్డు దారులకు వాలంటీర్లు  టైంస్లాట్ కూపన్లు కార్డుదారులకు అందచేశారని తెలిపారు. అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారు కూడా తమకు అందుబాటులో వున్న రేషన్ షాప్ నుంచి సరుకులు తీసుకునే అవకాశం వుందని స్పష్టం చేశారు.  


జిల్లా   చౌకదుకాణాలు మొత్తం రైస్ కార్డులు
పశ్చిమగోదావరి  2,211  12,59,925
చిత్తూరు   2,901  11,33,535
నెల్లూరు   1,895  9,04,220
తూర్పు గోదావరి  2,622  16,50,254
కృష్ణా    2,330 12,92,937
ప్రకాశం   2,151  9,91,822
గుంటూరు   2,802 14,89,439
వైఎస్ఆర్ కడప  1,737  8,02,039
విశాఖపట్నం   2,179  12,4,5266
విజయనగరం   1,404  7,10,528
శ్రీకాకుళం   2,013  8,29,024
కర్నూలు   2,363  11,91,344
అనంతపురం   3,012  12,23,684
కొత్తగా గుర్తించిన అర్హత  వున్న కుటుంబాలు : 81,862