వింజమూరు మండలంలో దారుణ హత్య

వింజమూరు మండలంలో దారుణ హత్య


పాలల్లో నిద్ర మాత్రలు కలిపి తాడు బిగించి చంపిన వైనం.. చౌటపల్లిలో హత్య చేసి వెంకటాద్రిపాళెం పొలాల్లో పూడ్చిన ఘటన... వింజమూరు, మే 4 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చౌటపల్లి గ్రామంలో మేడిపల్లి. వెంగళరావు అనే యువకుడిని సొంత చిన్నాన్న అత్యంత  దారుణంగా హత్య చేసి జామాయిల్ తోటలలోని ట్రెంచ్ లో పూడ్చిన సంఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. పూర్తి వివరాలలోకి వెళితే కావలి డి.యస్.పి డి.ప్రసాద్ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి.వెంగయ్య-ప్రభావతి ల ఏకైక కుమారుడు వెంగళరావు నాయుడు. నెల్లూరులో హోటల్ నిర్వహిస్తూ వివిద రాజకీయ పార్టీల నేతలతో వెంగళరావు సన్నిహితంగా ఉండేవాడని డి.యస్.పి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో వెంగళరావు అనతికాలంలోనే సంపన్నుడు కావడం, అత్యంత విలువైన ఫార్చ్యూనర్ కారులో తిరగుతుండటం సహించలేక అతనిపై ఈర్ష్యా ధ్వేషాలు పెంచుకున్న చిన్నాన్న రామక్రిష్ణ, మరొక వ్యక్తి నడిపి వెంగయ్యలు పధకం ప్రకారం తమ బంధువులైన దొడ్ల.శ్రీనివాసులు, ఆదెన్న, కర్నాటి.వెంకటేష్, వంశీకృష్ణలతో కలిసి ఈ నెల 1 వ తేదీన పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇవ్వడం జరిగిందన్నారు. స్వల్ప వ్యవధిలోనే వెంగళరావు మత్తులోకి జారుకున్న విషయాన్ని నిర్ధారించుకుని గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లు డి.యస్.పి పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని శంఖవరం - వెంకటాద్రిపాళెం మధ్య జామాయిల్ తోటల వద్దకు తీసుకెళ్ళి కందకాలుగా తీసి ఉన్న కాలువలో పూడివేశారన్నారు. వెంగళరావు 2 వ తేదీ నుండి కనిపించకపోవడంతో అతని బంధువు రమేష్ ఆందోళన చెందుతూ ఆదివారం రాత్రి వింజమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. మృతుడు వెంగళరావు చిన్నాన్న రామక్రిష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. దీంతో కలిగిరి సి.ఐ రవికిరణ్, వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డిలు రంగప్రవేశం చేసి 24 గంటల వ్యవధిలోనే కేసును చేధించడంతో పాటు మృతదేహాన్ని వెలికితీయడం జరిగిందన్నారు. మృతుడు వెంగళరావు నిత్యం ప్రయాణించే ఫార్చ్యూనర్ వాహనం దుత్తలూరు మండలంలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాహనమును స్వాధీనపరుచుకోవడంతో పాటు త్వరలోనే పరారీలో ఉన్న మిగతా నిందితులను అరెస్ట్ చేస్తామని డి.యస్.పి తెలిపారు. కాగా స్థానిక తహసిల్ధారు సుధాకర్ రావు నేత్ర్త్వంలో శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం వెంగళరావు మృతదేహమును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.