మండలంలో 44 వేల మాస్కులు పంపిణీ : యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని

 వింజమూరు, మే 9 (అంతిమ తీర్పు     -   దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో కోవిడ్-19 వైరస్ నివారణా చర్యలలో భాగంగా ప్రజలకు 44 వేల మాస్కులను పంపిణీ చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి యస్.కనకదుర్గా భవానీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో వింజమూరు మండలంలో ఈ వైరస్ నివారణకు గానూ మొదటి నుండి కూడా ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఫలితంగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని హర్షం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ స్వీయ నిర్భంధం పాటిస్తూ ప్రధానంగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలనే సంకేతాలను క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అంతేగాక ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే ప్రమాదకర పరిస్థితులు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అందజేసిన 44 వేల మాస్కులను మండలంలోని వాలంటీర్లు, కార్యదర్శుల ద్వారా ఒక్కొక్కరికి 3 మాస్కులు వంతున ఇంటింటికీ అందజేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, రెవిన్యూ సిబ్బంది, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య సిబ్బంది, సాంఘిక సం క్షేమ వసతిగృహాలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, గ్రామీణ నీటి పారుదల శాఖ, అగ్నిమాపక శాఖ, వ్యవసాయ శాఖ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు మాస్కులను పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించడం ప్రస్తుత పరిస్థితులలో ప్రధమ కర్తవ్యంగా భావించాలన్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసరమైతే మినహా ప్రజలెవరూ రోడ్లు మీదకు రాకూడదని కోరారు. కరోనా వైరస్ చైన్ సిస్టం లాంటిదని, ఒకరిని నుండి మరొకరికి ఈ వైరస్ గాలి ద్వారా వేగంగా సంక్రమించే లక్షణాలు కలిగి ఉన్నందున దాని నివారణకు అవగాహనతో మెలగడమే ముఖ్యమన్నారు. మాస్కులు ధరించడం వలన ఈ వైరస్ ను కొంతమేర 
 రూపుమాపవచ్చునని యం.పి.డి.ఓ పేర్కొన్నారు. కనుక ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అందజేసిన మాస్కులను నిత్యం ధరిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు.