టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
పాల్గొన్న టిడిపి ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు.
సమావేశంలో చర్చించిన అంశాలు:
1)ఫిబ్రవరిలో వచ్చిన కరెంటు బిల్లులే ప్రతినెలా వసూలు చేయాలి:
కరోనా పరిస్థితుల్లో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, ఆదాయాలు పడిపోయి, ప్రభుత్వమే ఉద్యోగులకు సగం వేతనాలు ఇస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలపై కరెంటు బిల్లులు మూడు నాలుగు రెట్లు వసూలు చేయడం గర్హనీయం. బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడంలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనన్ని రాయితీలు ఇవ్వాలే తప్ప కష్టాల్లో ఉన్న ప్రజలను పీడించడం భావ్యం కాదు.
కాబట్టి లాక్ డౌన్ పూర్తయ్యేదాకా ఫిబ్రవరిలో వచ్చిన కరెంటు బిల్లు మొత్తాన్నే కట్టించుకోవాలి, పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి.
2)స్వాధీనం చేసుకున్న వాహనాలను వెంటనే ఇచ్చేయాలి:
కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ప్రజల వాహనాలను పెద్దఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ ఆయా ప్రాంతాలలో దుమ్ముకొట్టుకుని పాడయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి వాటన్నింటిని సదరు వాహనదారులకు తిరిగి ఇచ్చేయాలి. వాళ్లపై పెట్టిన కేసులు వెంటనే రద్దు చేయాలి.
3)ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు ట్రస్టీలుగా ఉండాలి:
ట్రస్టీలుగా ఉండే ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను అమ్మేయడం ధర్మం కాదు. గత ఏడాదిగా రాష్ట్రంలో నెలకొన్న దుష్పరిణామాలు, ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా భూముల ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఆస్తుల అమ్మకం అవివేకం. పట్టణాల్లో ప్రజలందరికీ ఉపయోగపడే విలువైన భూములను కారుచౌకగా వైసిపి మాఫియాకు కట్టబెట్టేందుకే ‘‘బిల్డ్ ఏపి’’ పేరుతో, ‘‘సోల్డ్ ఏపి’’గా చేశారు. గుంటూరులో నగరం మొత్తానికి ఉపయోగపడే మార్కెట్ స్థలాలను, విశాఖపట్నంలో విలువైన పోలీస్ క్వార్టర్స్ భూములను అమ్మేయడం దారుణం.
కాబట్టి వెంటనే ‘‘సోల్డ్ ఏపి’’ కార్యక్రమాన్ని నిలిపేయాలి, విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలి.
4)కష్టాల్లో ఉన్న వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి:
వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్రం చూపే చొరవ రాష్ట్ర ప్రభుత్వంలో మచ్చుకు కూడా లేకపోవడం బాధాకరం. వలస కార్మికుల దైనందిన ఈతిబాధల నివారణకు కేంద్రం అనేక సహాయ చర్యలు చేపట్టింది. నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ప్రత్యేక రైళ్లలో వాళ్లను స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకుంది. అలాంటిది మన రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వలస కార్మికుల కష్టాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వలస కార్మికులను అన్నివిధాలా ఆదుకోవాలి. వారిలో భవిష్యత్ పై భరోసా కల్పించాలి.
5)వైసిపి మాఫియా దుర్మార్గాలను అరికట్టాలి:
కరోనాలోనూ వైసిపి మాఫియా ఆగడాలు రాష్ట్రంలో పేట్రేగిపోయాయి. లాక్ డౌన్ లోనూ ఇసుక అక్రమ తవ్వకాలు, గ్రావెల్ అక్రమ రవాణా విచ్చలవిడిగా చేస్తున్నారు. శాండ్ మాఫియా అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఇక మద్యం మాఫియా దుశ్చర్చలకు అంతుపంతు లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం(నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్) వైసిపి నాయకులే స్మగ్లింగ్ చేస్తున్నారు. గత 50రోజుల్లోనే భారీ ఎత్తున మద్యం స్మగ్లింగ్ కు పాల్పడ్డారు. తక్కువ ధరలకు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి మన రాష్ట్రంలో రెట్టింపు ధరలకు అమ్మి సామాన్యుల జేబులు గుల్లచేస్తున్నారు. అటు అనారోగ్యం పాలై, ఇటు ఆర్ధికంగా చితికిపోయి రెంటికి చెడ్డ రేవడిలా పేద కుటుంబాలను నిలువుదోపిడి చేస్తున్నారు.
కాబట్టి తక్షణమే స్పందించి శాండ్ మాఫియా, మద్యం మాఫియా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో టిడిపి మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం