నెలాఖరుకు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం : నెల్లూరు జిల్లా కలెక్టర్

 


  *నెల్లూరు, 15-05-2020*


నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం.., కలెక్టర్ .   యం.వి.శేషగిరి బాబు మీడియా సమావేశం నిర్వహించారు. నీటి విడుదలకు సంబంధించి రెండు రోజుల నుంచి పత్రికల్లో వస్తున్న వార్తలపై.., ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారని.., విచారణ అనంతరం నివేదిక ఆధారంగా లోటుపాట్లు ఉంటే సరిచేసి.., బాధ్యులపై చర్యలు తీసుకుంటారన్నారు. ఈ వివాదంపై ఇప్పటికే సోమశిల ప్రాజెక్టు ఎస్.ఈ ని కూడా వివరణ కోరామని మీడియాకు వెల్లడించారు. రెండో పంటకి నీరు అందించడానికి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు రిజల్యూషన్ ప్రకారం పెన్నా డెల్డా కింద 1,80,000 ఎకరాలకు, సోమశిల కాలువ కింద 67,500 ఎకరాలు కలిసి.. మొత్తం 2,47,500 ఎకరాలు మొత్తం 27.5 టి.ఎం.సిల నీళ్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. నీటి విడుదలకు సంబంధించి భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, అగ్రికల్చర్ శాఖల అధికారులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామన్నారు. స్థిరీకరించని ఆయకట్టులో రైతులు సాగుచేపట్టవద్దని.., ఎవరైనా అనధికారికంగా మోటార్ల ద్వారా నీరు పొలాలకు మల్లించడం, అనధికారిక ఆయకట్టులో సాగుచేపట్టడం చేస్తే.., అధికారులు తనిఖీలు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. కచ్చితంగా నిర్ణయించిన ప్రకారం స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని.., రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలన్నారు. సాగు, త్రాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని.., ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు రిజల్యూషన్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టిందని.., దీనిని గమనించకుండా స్థిరీకరించని ఆయకట్టులో రైతులు పంటలు వేస్తే సమస్యలు ఎదురవుతాయన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తల ద్వారా సలహాలు అందిస్తామన్నారు. నెలాఖరుకు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమవుతున్నాయని.., వాటి ద్వారా రైతులకు మరిన్ని సేవలందిస్తామన్నారు. ఏ కాలువ కింద ఎంత ఆయకట్టు ఉందో, ఉన్న ఆయకట్టులో ఎంత  శాతం నీళ్లు అందిస్తున్నారు అనే వివరాలను.. ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతి గ్రామ సచివాలయాల్లో రైతులకు తెలిసేలా ప్రదర్శించాలన్నారు. 
 


ఈ మీడియా సమావేశంలో సోమశిల ఎస్.ఈ రవీంద్రారెడ్డి, తెలుగుగంగ ఎస్.ఈ హరినారాణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.