*వింజమూరులో లాక్ డౌన్ నిబంధనలకు రెక్కలు... మద్యం షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు,... వింజమూరు, మే 4 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని మద్యం షాపుల వద్ద లాక్ డౌన్ నిబంధనలకు మందుబాబులు తూట్లు పొడిచారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ అయ్యాయి. ప్రస్తుత కరోనా వైరస్ సమయంలో లాక్ డౌన్ నియమ నిబందనలు అమలులో ఉండగా గ్రీన్ జోన్లులో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతులివ్వడం జరిగింది. అయితే మద్యం షాపుల వద్ద నిబంధనలు తూచ తప్పకుండా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కానీ ప్రభుత్వ ఆదేశాలు ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాలేదు. ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాలు తీస్తారని 10 గంటల నుండే మందుబాబులు మద్యం దుకాణాల పరిసరాలలో గుంపులు గుంపులుగా చేరిపోయారు. మాస్కులు ధరించిన పాపాన పోలేదు. 11:30 గంటలకు మద్యం షాపులు తీయడంతో మద్యం ప్రియులు ఎగబడ్డారు. పలు చోట్ల క్యూ పద్దతి ఉన్నా సమదూరం పాటించలేదు. మరికొన్ని చోట్ల విచ్చలవిడిగా కౌంటర్ల వద్ద గుమికూడారు. ఆదివారం నాటి వరకు లాక్ డౌన్ నిబంధనలు ఒక ఎత్తు కాగా సోమవారం మాత్రం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మద్యం ప్రియులు ద్విచక్ర వాహనాలలో ఇద్దరు ముగ్గురు వెళుతూ హల్ చల్ చేయడం కనిపించింది. ప్రస్తుతం ఉన్న ధరలపై 25 శాతం అదనంగా రెట్లు పెంచగా అంతకంటే ఎక్కువ నగదును మద్యం షాపుల నిర్వాహకులు వసూలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఎస్.ఐ బాజిరెడ్డి ఒక కేసు దర్యాప్తు విషయంలో బిజీ బిజీగా ఉండటంతో మద్యం షాపుల వద్ద ప్రభుత్వ నియమ నిబంధనల ఉల్లంఘనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతులివ్వడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజలకు జీవన స్థితిగతులకు ఆసరాగా నిలిచే దుకాణాలను మూసివేయించి కుటుంబాల ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే మద్యం దుకాణాలకు అనుమతులివ్వడం ఏంటని సర్వత్రా ప్రజలు ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తి పోశారు.
వింజమూరులో లాక్ డౌన్ నిబంధనలకు రెక్కలు... మద్యం షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు,...