ప్రజలకు కరోన దెబ్బ కంటే, వైసిపి కరెంటు బిల్ షాక్ ప్రజలకు ఎక్కువగా తగిలింది
కరోనా కైనా ప్రజల పై కనికరం ఉంది గాని, జగన్ గారి ప్రభుత్వానికి మాత్రం కనికరం లేదు
విద్యుత్ బిల్లుల పెంపును రద్దు చేయాలి,మార్చ్ నెల బిల్లునే ఏప్రిల్ నెలకు వర్తింపజేయాలి
మూడు నెలల ఉచిత రేషన్ ఇచ్చామని, దానికి రెండింతల బారాన్ని పేద ప్రజలపై మోపారు
విజయవాడ మే 16 (అంతిమ తీర్పు) : బెంజ్ సర్కిల్ వద్ద గల జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ కరోనా షాక్ కన్నా కరెంటు బిల్లులు షాక్ రాష్ట్ర ప్రజలను ఎక్కువ ఇబ్బంది పెడుతుందని, రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కూడా కరెంటు బిల్లుల భారం కుదిపేస్తుందని రెండు నెలల బిల్లులు సరాసరి చేసి స్లాబ్ మార్చడం వలన బిల్లులు నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చాయని ఇది పూర్తిగా ప్రభుత్వ కుట్రేనని ఒక్క యూనిట్ తేడా వస్తే ఏ-కేటగిరి వారు బి -కేటగిరీ లోనికి, బి-కేటగిరీ వారు సి-క్యాటగిరి లోనికి మారతారని తద్వారా బిల్లు తడిసి మోపెడు అవుతాయని, ఒక ప్రాంతంలో తేడా రావచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ బిల్లులు ఎందుకు తేడా వస్తాయని స్లాబ్స్ మారడం వలన 400 నుంచి 500 శాతం అధికంగా బిల్లులు వచ్చాయని కరోనా లాక్ డౌన్ వలన వాణిజ్య సముదాయాలు విద్యుత్ వినియోగించక పోవడం వలన ప్రభుత్వాలకు నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆ భారాన్ని మోపి 2800 కోట్ల అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత నెలలో ప్రభుత్వం మూడు విడతలుగా రేషన్ ఇచ్చామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు నేడు కరెంట్ బిల్లు ద్వారా రేషన్ కు రెండింతలు వసూలు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు కరోనా షాక్ కన్నా కరెంటు బిల్లులు షాక్ కి భయపడి ప్రభుత్వ క్వారంటైన్ కు వెళ్తే ఏ బాధలు ఉండవనే స్థాయికి వచ్చారంటే జగన్ గారి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచన్నారు.ఎన్నికల్లో అక్క,చెల్లెల బుగ్గలు నిమురుతూ ఓట్లు వేయించుకొని ప్రతి అక్క, చెల్లెమ్మకు మద్యం ద్వారా ఒక చెంప ను, విద్యుత్ బిల్లు ద్వారా మరొక చెంప చెల్లుమనిపించిన ఘనత జగన్ గారికే దక్కుతుందన్నారు.ఈ ప్రభుత్వానికి నిజంగా పేద,సామాన్య వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే మార్చి నెల యావరేజ్ బిల్లును, ఏప్రిల్ లో ప్రజలు చెల్లించారని దాన్నే తుది బిల్లు గా పరిగణించాలని అదే విధంగా ఏప్రిల్ బిల్లు ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రజల తరపున పోరాడతామన్నారు.