పారిశుద్ద్య కార్మికులను ప్రత్యేకంగా గుర్తించాలని డిమాండ్

పారిశుద్ద్య కార్మికులను ప్రత్యేకంగా గుర్తించాలని డిమాండ్


వింజమూరు, మే 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో పారిశుద్ద్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారిని వెంటనే ప్రభుత్వం 4 వ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని యం.ఆర్.పి.ఎస్ జిల్లా అధికార ప్రతినిధి పందిట.అంబేద్కర్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మేడే కార్మికుల దినోత్సవమును పురస్కరించుకుని స్థానిక బంగ్లాసెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద పారిశుద్ద్య కార్మికులను యం.ఆర్.పి.ఎస్ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉందన్నారు. ఈ వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయన్నారు. ప్రజలందరూ కూడా స్వీయ నిర్భంధంలో ఉంటున్నారన్నారు. పారిశుద్ద్య కార్మికులు మాత్రం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిత్యం వీధులలో తిరుగుతూ ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడుతున్న వైనం అందరికీ తెలిసిందేనన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ద్య కార్మికుల సేవలను గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని అంబేద్కర్ డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రస్తుతం విధులలో ఉన్న పలు ప్రభుత్వ శాఖల విభాగాల సిబ్బందితో పాటు నిత్యం వార్తల సేకరణలో ఉన్న జర్నలిస్టు మిత్రులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.పి.ఎస్ నేతలు బంగా.క్రిష్ణమూర్తి, కొండమ్మ, దొరసానమ్మలు పాల్గొన్నారు.