తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించిన అంశాలు-తీర్మానాలు

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించిన అంశాలు-తీర్మానాలు
1) గ్యాస్ లీకేజి మృతులకు నివాళులు-బాధితులకు అండగా ఉండాలని తీర్మానం
విశాఖ గ్యాస్ లీకేజి మృతులకు టిడిపి పోలిట్ బ్యూరో నివాళులు అర్పించింది. రెండు రాష్ట్రాలలో కోవిడ్ మృతులకు నివాళులు అర్పించారు.  బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. 
రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని ఖండించింది. తక్షణమే ఆయా కుటుంబాల వారిని  ఆదుకోవాలని డిమాండ్ చేసింది. 
2)ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై చర్చ: 
మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సహా విశాఖలోని జలాశయాల్లో నీళ్లు కలుషితం కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి వచ్చినవాళ్లు కూడా విషవాయువు తీవ్రతకు భయపడి  మళ్లీ వెళ్లిపోవడం ఆందోళనకరం.
ఎంత పరిధిలో ప్రజలు విషవాయువుల దుష్ప్రభావానికి లోనవుతారు, వాటి దుష్పరిణామాల నుంచి బాధితులను కాపాడటం, ద్రవరూపంలో ఉండే స్టైరీన్ వాయువుగా మారడం, అందులో రసాయనం ఏమైనా కలిసిందా, భవిష్యత్తులో అక్కడి ప్రజల ఆరోగ్యంపై, పంటలపై, ఇతర జీవరాశిపై ప్రభావాల గురించి సమగ్రంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. 
ఇది మానవ తప్పిదమే అని ఆ రోజే చెప్పాం. దానిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశాం. బాధితులు అందరినీ కాపాడాలి, సైంటిఫిక్ డేటా విశ్లేషించాలని కోరాం.
ట్యాంకు వద్ద 20డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాల్సింది, 154డిగ్రీలకు వెళ్లింది, మేము వెళ్లినప్పుడు 135డిగ్రీలు ఉందని విచారణకు వెళ్లిన వాళ్లే చెప్పారు. 
ఏవో కొద్దిగా శ్వాస సమస్యలే తప్ప పెద్ద సమస్య లేదని అధికారులు మొదట తేలిగ్గా చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిని చాలా తేలిగ్గా తీసుకున్నారు. మల్లీ నేషనల్ కంపెనీ అంటూ పరిశ్రమకు వత్తాసుగా మాట్లాడారు. 
జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చాలి. బాధితులను ఎలా ఆదుకోవాలన్నదే ప్రధానం. గ్యాస్ లీకేజి దుర్ఘటన దుష్ప్రభావాన్ని ఎలా అధిగమించాలన్నదే ముఖ్యం.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలని, నిందితులను శిక్షించాలని, బాధితులను ఆదుకోవాలని తీర్మానం ఆమోదించారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై టిడిపి పోలిట్ బ్యూరో సీరియస్ గా డిస్కస్ చేసింది. ఈ కంపెనీని వెంటనే మూసేయాలని పోలిట్ బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. 
ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ఇది మానవ తప్పిదం కాబట్టి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలి. 12మంది చావుకు కారణమైన ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని శిక్షించాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. 
బాధితులకు ముందుగా తక్షణ ఉపశమనం కల్పించాలి. వారికి అందించాల్సిన తక్షణ సాయం అందజేయాలి. 
దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యంపై, పర్యావరణంపై పడే ప్రభావం అధ్యయనం చేయాలి. స్టైరీన్ విస్తరించిన 5-6కిమీ పరిధిలో దీని ప్రభావంపై స్టడీ చేయాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. 
ఇక్కడి గాలి, మట్టి, నీటిపై సమగ్రంగా పరీక్షించాలి. వాటిపై దీని దుష్ప్రభావం అధ్యయనం చేయాలి. నిపుణుల కమిటిలు వేసి అధ్యయనం చేయాలి. నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. 
అక్కడ పండే పంటలు తినరాదని, పాలు తాగరాదని, ఆహారం తీసుకోరాదని నిపుణులు సంస్థలు హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు చేపట్టాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలి. విష వాయువులు పీల్చి బాధితులైన ప్రజలు  కొన్నాళ్లు పని కూడా చేయలేరు, కాబట్టి వారికి జీవనోపాధి కల్పించాలి.
ఐదారు కిమీ పరిధిలో విష వాయువులు  వ్యాపించినందున, పరిహారం కూడా ఆ పరిధిలో బాధితులు అందరికీ ఇవ్వాలి.
దక్షిణ కొరియాలో, ఇతర దేశాల్లో  ఇలాంటి దుర్ఘటనలు జరిగిన చోట్ల ఇచ్చిన పరిహారాలను అధ్యయనం చేసి విశాఖ బాధితులకు మెరుగైన పరిహారం అందజేయాలి. 
బాధితుల ఆరోగ్యం, వారి ఆర్ధిక పరిస్థితి, స్థానిక పర్యావరణంపై దుష్ప్రభావం బేరీజు వేసుకుని తక్షణ సహాయ చర్యలు, దీర్ఘకాలంలో ఆదుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని నష్టపరిహారం నిర్ణయించాలి. 
ప్రతి వ్యక్తికి హెల్త్ చెకప్ చేయాలి. హెల్త్ ప్రొఫైల్ ఉండాలి. బాధితులు అందరికీ ఎలక్రాికనిక్ హెల్త్ రికార్డులు మెయింటైన్ చేయాలి.
 ఐదారు గ్రామాల మధ్య ఒక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నెలకొల్పాలి. విషవాయు బాధితులు అందరికీ ఆ హాస్పటల్ లోనే ఎప్పటికప్పుడు అత్యున్నత చికిత్స అందించాలి. 
పశుగ్రాసం కూడా విషపూరితం అయ్యింది కాబట్టి బైటనుంచి దాణా తెప్పించి అందజేయాలి. టిడిపి ప్రభుత్వం పంపిణీ చేసిన సైలేజ్, కాన్సెంట్రేట్స్ ను కూడా రద్దు చేయడం దారుణం.
ఈ ఫ్యాక్టరీ టిడిపి వాళ్లదైతే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపేవారు. దుర్ఘటనకు కారకులైన పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి.
ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు చేసుకోవాలి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ముఖ్యమంత్రి, మంత్రుల బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను పోలిట్ బ్యూరో ఖండించింది. ‘‘మావాళ్లు కూడా చనిపోతే బాగుండని కోటి వస్తుందని అనుకుంటున్నారనే’’ వ్యాఖ్యలు వైసిపి నేతల అమానుష ధోరణికి నిదర్శనం.6వేల టన్నులు స్టైరీన్ ను లోడ్ చేసి పంపుతున్నామని ఒక మంత్రి అంటారు. 18వేల టన్నులు ఉందని మరో మంత్రి చెబుతారు. 13వేల టన్నుల ఉందని మరొకరు అంటారు. మంత్రుల వ్యాఖ్యలతో ప్రజల్లో గందరగోళం. 
అక్కడ నిద్రించినట్లు వైసిపి నాయకులు చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికి కూడా ఎల్జీ పాలిమర్స్ కంపెనీది తప్పు అని వైసిపి నాయకులు చెప్పలేక పోతున్నారు.
ట్యాంకర్లలో ఉన్న స్టైరీన్ ను విదేశాలకు పంపడంపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు పీల్చిన విష వాయు దుష్ప్రభావాన్ని, ప్రజల ప్రాణాలకు, పంటలకు, పాడి పశువులకు జరిగిన నష్టాన్ని పట్టించుకోడం లేదు. 
ముఖ్యమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి దుర్ఘటనా స్థలానికి వెళ్లకుండా,  నేరస్తులను ముందే కలిస్తే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది..?  నేరం చేసినవాళ్లతో సీఎం సమావేశం పెట్టుకోడాన్ని ఏమనాలి..? దుర్మార్గుల చేతిలో అధికారం ఉండటం ప్రజల దురదృష్టం. బాధితుల దురదృష్టం.
బాధితులకు న్యాయం జరిగేదాకా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. రాజీలేని పోరాటం చేస్తుంది.


2)కరోనా పై పోలిట్ బ్యూరోలో చర్చ: 
రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే కరోనా రాష్ట్రంలో విస్తృతం అయ్యింది. గుంటూరులో వైసిపి నాయకుడు ఇచ్చిన విందు వల్ల దుష్ఫలితాలు చూశాం. వైసిపి ఎమ్మెల్యేలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారు. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ల ర్యాలీ, నగరిలో, కనిగిరిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి వైరస్ వ్యాప్తికి కారణం అయ్యారు. రేషన్ పంపిణీలో, మద్యం అమ్మకాలలో ఇష్టారాజ్యంగా గుంపులుగా చేసి కరోనా మరింతగా వ్యాపించేలా చేశారు. 
బైటనుంచి వచ్చినవాళ్లను క్వారంటైన్ కు పంపాలని టిడిపి మొదటినుంచి చెబుతోంది. కానీ వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనా మామూలు ఫ్లూ లాంటి జ్వరమేనని, పారాసిటమాల్, బ్లీచింగ్ చాలని తేలిగ్గా మాట్లాడారు.  
అన్నిదేశాల్లో, రాష్ట్రాల్లో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడంపై శ్రద్ద పెడుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం నాసిరకం మద్యం బ్రాండ్ల ద్వారా వ్యాధి నిరోధక శక్తి దారుణంగా దెబ్బతీస్తున్నారు. లిక్కర్ వల్ల ఇమ్యూనిటి దెబ్బతింటుంది, అలాంటిది నాసిరకం మద్యం వల్ల దుష్పరిమాణాలు అత్యధికం. 
లిక్కర్ కావాలంటే డోర్ డెలివరీ చేయండి, క్యూలైన్లలో జనాన్ని గుంపులుగా నిలబెట్టవద్దని న్యాయస్థానాలు హెచ్చరించాయంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
హాట్ జోన్లలో నిత్యావసరాలు ఇంటింటికీ సరఫరా చేయాలి. ప్రజల ఆరోగ్యం నిశితంగా పరిశీలించాలి.
జిఎఫ్ ఎస్ టి అధ్యయనాలను ప్రశంసించిన పోలిట్ బ్యూరో: 
జిఎఫ్ ఎస్ టి చేసిన అధ్యయనాన్ని పోలిట్ బ్యూరోలో ప్రశంసించారు. మొత్తం దేశానికే ప్రయోజనకరమైన అధ్యయనాలు చేయడాన్ని అభినందించారు. 
జోన్ల వర్గీకరణపై, ఎంఎస్ ఎంఈ రంగాన్ని ఆదుకోవడంపై సూచనలు చేశారు. 80% ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ ఎంఈ రంగమే కాబట్టి వడ్డీలేని రుణాలు ఇచ్చి ఎంఎస్ ఎంఈ రంగాన్ని ఆదుకోవాలి. కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించగలిగే సామర్ధ్యం పెంచేలా చూడాలి. 
రైతుల వద్ద పంట ఉత్పత్తులను ప్రభుత్వమే సేకరించాలి, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. హార్టీ కల్చర్, ఆక్వా కల్చర్, సెరి కల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలి.
వలస కార్మికులను కేరళ ప్రభుత్వం గెస్ట్ వర్కర్లుగా పేర్కొంది. వాళ్లను ఆతిథ్య కార్మికులుగానే చూడాలి. అన్నివిధాలా ఆదుకోవాలి.
కరోనాలోనూ వైసిపి నాయకుల కుంభకోణాలను ఖండించిన పోలిట్ బ్యూరో: 
ఏపిలో కరోనా కష్టకాలంలో కూడా, చివరికి బ్లీచింగ్ లో కూడా రూ70కోట్ల కుంభకోణానికి పాల్పడటాన్ని ఖండించారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు. నాసిరకం శానిటైజర్లు, నాసిరకం మాస్క్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కిరోసిన్ కంపు కొడుతున్నాయని మాస్క్ లు అక్కడే పారేశారు. 
   లాక్ డౌన్ లో కూడా ఇసుక దందాలు, గ్రావెల్ తరలింపును పోలిట్ బ్యూరోలో ఖండించారు. లాక్ డౌన్ లో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఖండించారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను నియమించడాన్ని ఖండించారు. 
మడ అడవుల నరికివేత-భూసేకరణలో స్కామ్ లను ఖండించిన పోలిట్ బ్యూరో: 
మడ అడవులను విచక్షణారహితంగా నరికేయడాన్ని పోలిట్ బ్యూరోలో టిడిపి నేతలు ఖండించారు. దీనివల్ల భవిష్యత్తులో తీరప్రాంతానికి తుఫాన్ల ముప్పు ఉంటుందని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆవభూముల కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడటాన్ని గర్హించారు. 
టిడిపి ప్రతినిధుల బృందాలు రెండు ఈ ప్రాంతాల్లో పర్యటించి వీటిపై నిజ నిర్దారణ చేయాలని తీర్మానించారు. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో భూముల కొనుగోళ్లలో ప్రతి నియోజకవర్గంలో వైసిపి నాయకులు భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎకరం రూ 7లక్షలు చేయని భూములను రూ70లక్షలకు కొని వాటాలు వేసుకుని పంచుకోడాన్ని గర్హించారు. ముడుపుల కోసమే మద్యం రేట్లను భారీగా పెంచాలని దుయ్యబట్టారు.
ఫ్రంట్ లైన్ వారియర్ల కృషికి టిడిపి పోలిట్ బ్యూరో అభినందన:


ప్రాణాలు కూడా లెక్కపెట్టుకోకుండా కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లను అభినందించారు. 40రోజులపాటు వారు చేసిన  త్యాగాలను మద్యం దుకాణాలు తెరిచి బూడిదపాలు  చేశారు. లాక్ డౌన్ తో కోట్లాది ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉపాధి కోల్పోయి త్యాగాలు చేశారు. వాళ్ల మొరాలిటి దెబ్బతీసేలా మద్యం దుకాణాలు తెరవడాన్ని టిడిపి పోలిట్ బ్యూరో ఖండించింది.
ఫ్రంట్ లైన్ వారియర్లకు కావాల్సిన పిపిఈలు(మాస్క్ లు, సూట్లు, ఐషీల్డ్ గాగుల్స్..) ఇవ్వలేక పోవడాన్ని ఖండించింది. 
పేదలు, వలస కార్మికుల ఆకలి దప్పులను ఏపిలో వైసిపి ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోలేదు.  ప్రతి పేద కుటుంబానికి రూ5వేలు ఇవ్వాలని కోరినా స్పందన లేదు. అన్నా కేంటిన్లు తెరవాలి, బీమా పునరుద్దరించాలి, ప్రతి పేద కుటుంబానికి రూ 10వేలు ఇవ్వాలి. కేరళ తరహాలో 17రకాల నిత్యావసర సరుకులు రాబోయే లాక్ డౌన్ లో కూడా ఇంటింటికి పంపిణీ చేయాలి.
కరెంటు ఛార్జీలు పెంచడాన్ని ఖండించిన పోలిట్ బ్యూరో: 
ఈ విపత్కర పరిస్థితిలో కరెంటు ఛార్జీలను పెంచడాన్ని ఖండించింది. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ గాలికి వదిలేసి 4రెట్లు పెంచారు. లాక్ డౌన్ పీరియడ్ లో కూడా మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేయడాన్ని ఖండించారు. ఇప్పటికే ఆర్టీసి ఛార్జీలు పెంచారు. ఇసుక, మద్యం ధరలు, పెట్రోల్, డీజిల్  రేట్లు పెంచేశారు. ధరలు పెంచి భారాలు వేయడాన్ని గర్హించారు.
పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ: 
పంటలు అమ్ముడుపోక నష్టాల్లో మునిగిన రైతులు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు మద్దతుగా 12గంటల నిరాహార దీక్షలు చేసిన టిడిపి నాయకులను పోలిట్ బ్యూరో అభినందించింది. కూరగాయలు, నిత్యావసరాలు, కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన దాతలను అభినందించింది. మద్యం దుకాణాలు మూసేయాలని, ప్రజారోగ్యం కాపాడాలని 12గంటల దీక్షలు చేసిన తెలుగు మహిళలను అభినందించిది.
తప్పుడు కేసులను ఖండించిన పోలిట్ బ్యూరో: 
టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో గర్హించింది. విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో బాధితులపై, వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్షాల నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన దాతలపై కూడా కేసులు పెట్టడం నీచంగా పేర్కొంది. దాతలిచ్చే సాయం కూడా తమ పేరుతో పంపిణీ చేయాలని, తమకు అందజేస్తే తామే పంపిణీ చేస్తామని వైసిపి నాయకులు పేర్కొనడాన్ని గర్హించింది. అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేసింది.
టిడిపి మహానాడు నిర్వహణపై చర్చ: 
టిడిపి మహానాడును వర్ట్యువల్ గా నిర్వహించడంపై పోలిట్ బ్యూరోలో చర్చించారు. అందులో చేపట్టాల్సిన తీర్మానాలు, కమిటిల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. 
ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ, పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, రావుల చంద్రశేఖర రెడ్డి, ప్రతిభా భారతి, నారా లోకేష్, గల్లా జయదేవ్ , అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరుణ కుమారి, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. 
                                 ----


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image