*నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ* వింజమూరు, మే 17, (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో ఆదివారం నాడు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ మాంసం విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యక్తులకు పంచాయితీ సెక్రటరీ బంకా.శ్రీనివాసులు రెడ్డి 5 వేల రూపాయలను జరిమానాలుగా విధించారు. ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా గత నెల రోజుల వ్యవధిలో ఆదివారం దినములలో చికెన్, మటన్, చేపల విక్రయాలు జరపరాదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న విషయాలు అందరికీ తెలిసిందే. ఆదివారం సమయాలలో ఈ దుకాణాల వద్ద రద్దీ అధికంగా ఉంటుందని, ఈ పరిణామాలు కరోనా వైరస్ వ్యాప్తికి కారణభూతాలవుతాయనే ఉద్దేశ్యంతో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు దిశగా అడుగులు వేస్తున్నారు. వింజమూరులోని బంగ్లాసెంటర్, షఫి హాస్పిటల్ వీధి, దేవతా మహల్ సెంటర్, గంగమిట్ట తదితర ప్రాంతాలలో మాంసం విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ప్రజలు సమదూరం పాటిస్తేనే కరోనా వైరస్ కట్టడి సాధ్యమని భావించిన అధికారులు ఆదివారాలలో మాంసం దుకాణాల వద్ద ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు ఈ అమ్మకాలపై నిషేదం విధించారు. కానీ కొంతమంది వ్యాపారులు రహస్య ప్రదేశాలలో మాంసం విక్రయాలకు నడుం బిగించారు. వీటిపై నిఘా ఉంచిన పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి ఆదివారం నాడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తమ సిబ్బందితో పలు ప్రాంతాలలో సోదాలు చేసి నలుగురు మాంసం విక్రయదారులకు 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అందరూ కంకణ బద్ధులై ఉండాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉందన్నారు. లాక్ డౌన్ నిబంధనల అంశాల విషయంలో ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు.
నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ*