*నిబందనల మేరకు షాపులకు అనుమతులు :తహసిల్ధారు సుధాకర్ రావు...
వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులో ప్రభుత్వ నియమ నిబందనల మేరకు వివిద రకాల వ్యాపారులకు షాపులను తీసుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తామని తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ అధికారిణీ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తీసి వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తహసిల్ధారు పేర్కొన్నారు. అయితే హోటళ్ళు, టీ దుకాణాలు, బార్బర్ (మంగళి) షాపులకు మాత్రం ఉన్నతాధికారుల నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఎట్టి పరిస్థితులలోనూ అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కనుక వ్యాపారస్థులు ఈ విషయాలను గమనించి షాపులు తీసేందుకు స్థానిక తహసిల్ధారు కార్యాలయంలో అనుమతి పత్రాలను పొందాలన్నారు. వాటిని ఆయా దుకాణాల ముందు బహిర్గతపరిచి ఉదయం 6 నుండి 9 గంటల లోపు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వింజమూరు మండలంలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, ఇది ప్రజలందరి విజయంగా భావిస్తున్నామన్నారు. మరికొద్ది రోజులు ఓపిక పడితే ఈ కరోనా మహమ్మారిని సమూలంగా నియంత్రించవచ్చునని ఈ సందర్భంగా తహసిల్ధారు పిలుపునిచ్చారు.