టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం

టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం(13.05.2020)
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం బుధవారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆన్ లైన్ లో నిర్వహించారు.  పోలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో, జాతీయంగా అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను పోలిట్ బ్యూరో దృష్టికి తెచ్చారు. 
ప్రధాని శ్రీ నరేంద్రమోది రూ20లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  
‘‘కరోనా ముందు, కరోనా సమయంలో, కరోనా తర్వాత’’ అనేవిధంగా ఇకపై ప్రపంచవ్యాప్త అధ్యయనాలు ఉంటాయి. ఆర్ధిక వ్యవస్థతో పాటు జీవన విధానంలో పెనుమార్పులు. నిరుద్యోగం, ఆహార సమస్య, ఆర్ధిక వ్యవస్థ తలకిందులు, రైతులు దెబ్బతినడం, పరిశ్రమలు సిక్ కావడం, ఉపాధి కోల్పోవడం, అనేక సమస్యలు చుట్టుముట్టాయి. 
కరోనా నియంత్రణలో విఫలమైతే జరిగే నష్టం అపారం. ప్రజలను మానసికంగా సిద్దం చేయడం ముఖ్యం. పాలకులు అసమర్ధులు అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. 
దేశంలో ఇప్పుడు  లాక్ డౌన్ -4లోకి రాబోతున్నాం. లాక్ డౌన్ 1 నుంచి 4వరకు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ (జిఎఫ్ ఎస్ టి) ద్వారా కేంద్రానికి( ప్రధాని, పిఎంవో, నీతిఅయోగ్ లకు) 5 లేఖలు రాశాం. 
బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పని చేస్తోంది, నిపుణులతో చర్చిస్తోంది, పబ్లిక్ పాలసీ రూపొందించి ప్రభుత్వాలకు పంపుతోంది. 
తెలుగుదేశం పార్టీ గత 4దశాబ్దాలుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తోంది. వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు పబ్లిక్ పాలసీలు రూపొందించడం, సమస్యల పరిష్కార మార్గాల అన్వేషణ, ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడం చేశాం. వివిధ సందర్భాల్లో మనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ప్రజలకు ఉపయోగపడ్డాం. ప్రధాని వాజ్ పేయి హయాంలో టిడిపి ఆధ్వర్యంలో వేసిన కమిటి సిఫారసులతో టెలి కమ్యూనికేషన్ల రంగంలో అభివృద్ది సాధ్యం అయ్యింది. ఇన్సూరెన్స్ పాలసీలలో మార్పులు వచ్చాయి. సూక్ష్మ సేద్యంపై వేసిన కమిటి సిఫారసులతో దేశవ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ అభివృద్ధికి దోహదపడింది. దేశ వ్యాప్తంగా నదుల అనుసందానంపై చర్చకు నాంది పలికింది. డిమానిటైజేషన్ పై కమిటి సిఫారసులతో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి.
టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థలను నిర్మిస్తే, గత ఏడాదిలోనే  వైసిపి ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసింది. కరెంటు బిల్లులు 4రెట్లు పెరిగాయని పేదలు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, అరటి, మామిడి, బత్తాయి, బొప్పాయి, కర్బూజ, పుచ్చ తదితర పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. 
అకాల వర్షాలతో రెండు రాష్ట్రాలలో  పంట నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్నవాళ్లు, దేశాలు-రాష్ట్రాలే భవిష్యత్తులో నిలదొక్కుకుంటారు.
లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా ప్రధాని దేశాన్ని కట్టుబాటు చేయగలిగారు. లాక్ డౌన్ 2, లాక్ డౌన్ 3 అమలు చేశారు. అయితే నిబంధనల అమలులోనే కొన్ని రాష్ట్రాలలో పొరబాట్లు జరిగాయి. మద్యం దుకాణాలు తెరవడం తప్పిదంగా మారింది. జూన్, జులైలో కేసులు మరింత పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
కరోనా నియంత్రణలో మొదట్లో క్వారంటైన్ సక్రమంగా చేయలేక పోయారు. జోన్లుగా విభజించినా సక్రమంగా పర్యవేక్షించడంలో విఫలం అయ్యారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల సమస్య పెరిగింది. 
ఏపిలో మద్యం మూడిందాలా నష్టం చేసింది. నాసిరకం బ్రాండ్లతో ఆరోగ్యం దెబ్బతింది. ఆర్ధికంగా జేబులు గుల్ల చేశారు. గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసులు పెరిగాయని’’ చంద్రబాబు ఆవేదన చెందారు.