వింజమూరులో చికెన్, మటన్ విక్రయాలకు బ్రేక్

వింజమూరులో చికెన్, మటన్ విక్రయాలకు బ్రేక్


వింజమూరు, మే 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో ఈ ఆదివారం కూడా చికెన్, మటన్, చేపల విక్రయాలపై అధికారులు నిషేదం విధించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా గత 4 ఆదివారాల రోజులలో ఈ విక్రయాలు జరపరాదని సంబంధిత శాఖల అధికారులు ముందుగానే దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రతి ఆదివారం నాడు వింజమూరులో బంగ్లాసెంటర్, షఫి హాస్పిటల్ వీధి, దేవతా మహల్ సెంటర్ల వద్ద జోరుగా చికెన్, మటన్, చేపల విక్రయాలు జరుగుతుంటాయి. మాంసం ప్రియులు గుంపులు గుంపులుగా చేరడంతో రద్దీ వాతావరణం నెలకొంటుంది. కరోనా కట్టడికి ప్రజలు సమదూరం పాటించాలనే స్పష్టమైన నిబంధనలు అమలులో ఉన్నందున ఆదివారం నాడు చికెన్, మటన్, చేపల విక్రయాలుపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఫలితంగా ఆదివారం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ ఆదేశాల మేరకు పంచాయితీ సెక్రటరీ శ్రీనివాసులురెడ్డి తెల్లవారుజామున 4:30 గంటలకే తమ సిబ్బందితో ఆయా ప్రాంతాలకు చేరుకుని దుకాణాలలో విక్రయాలు జరపరాదని ఆం క్షలు విధించారు మరొక వైపు తహసిల్ధారు సుధాకర్ రావు, ఎస్.ఐ బాజిరెడ్డిలు కూడా ఆదివారం నాడు చికెన్, మటన్, చేపల విక్రయాలపై నిషేదం దిశగా దృష్టి సారించి ఎక్కడైనా సరే విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గత 4 వారాల నుండి వింజమూరులో చికెన్, మటన్, చేపల విక్రయాలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ విస్తరణ తగ్గుముఖం పట్టే వరకు మాత్రమే ఈ నిబంధనలు అమలులో ఉంటాయని , ఈ పరిస్థితులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వింజమూరు మండలం గ్రీన్ జోన్ లో ఉన్నప్పటికీ పరిసర మండలాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదై ఉన్నందున తప్పనిసరి పరిస్థితులలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలియజేశారు.