రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర కల్పన గురించి ముఖ్యమంత్రి కి లోకేష్ లేఖ

తేదీః 12-05-2020  
గౌరవనీయులైనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు   
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి  


         


         విషయం: రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర కల్పన గురించి 


  రాష్ట్రంలో పసుపు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు లాక్ డౌన్ నిబంధనలు, మరోవైపు అరకొర కొనుగోళ్లతో నష్టాలపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 33వేల ఎకరాల్లో పసుపును సాగు చేశారు. 8.25 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కడప, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పసుపును అధికంగా సాగు చేశారు. ప్రభుత్వం పసుపు క్వింటాలుకు రూ.6,850ల గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రైతులకు మాత్రం ఆ ధర లభించడం లేదు. ఎన్నికలకు ముందు క్వింటా రూ.15వేలు ఉంటేగానీ పసుపుకు గిట్టుబాటు కాదని ఊదరగొట్టిన వైసీపీ.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రస్తుత పరిస్థితుల్లో పసుపుకు కనీసం రూ.10వేలు ధర ఉంటే కానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ ఇప్పటి ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక పసుపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు అప్పుల భారం వారిని మరింత కుంగదీస్తోంది. మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లేమి ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడం ప్రభుత్వ అసమర్థతను, నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. రైతుల గురించి గొప్పగా మాట్లాడే వైసీపీ నేతల.. చేతలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. పసుపు రైతుల గోడు మీకు పట్టడం లేదా? మార్కెట్ లో క్వింటా పసుపుకు రూ.5 వేల నుంచి 5,400 ధర మాత్రమే లభిస్తోంది. ఈ లెక్కన మీరు ప్రకటించిన ధర ప్రకారమే పసుపు రైతులు క్వింటాకు రూ.1450 నుంచి రూ.1850 వరకు నష్టపోతున్నారు. 
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు నిజమని నమ్మి, ఎన్నో ఇబ్బందులు పడి పెద్ద ఎత్తున పండించిన పసుపుతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు  అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస ఏర్పాట్లు లేక, కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొనుగోళ్లు ముమ్మరం చేయకపోవడంతో కొన్నిచోట్ల ఆరబెట్టిన పంట తడుస్తుందేమోనని రైతులు భయపడుతున్నారు. తుఫాను నేపథ్యంలో రైతుల  వద్ద ఉన్న మొత్తం పంటను ప్రభుత్వమే త్వరగా కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో రైతులు నష్టపోతారు. మరోవైపు వర్షం కురిస్తే ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్లు కొరతకూడా ఉంది. అటు నిల్వ చేసుకునేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పసుపు రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ-క్రాప్ లో సాగుకు మించి విస్తీర్ణం నమోదుకావడం కూడా అనుమానాలకు తావిస్తోంది. మీ ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న పసుపు రైతులను తక్షణమే ఆదుకొండి. 


                                                                         ఇట్లు                                                                     నారా లోకేష్
                                                      తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image