నా డ్రైవర్ వాహనాన్నే నిలువరిస్తారా...మీ సంగతి చూస్తా... పోలీసు సిబ్బందిపై ఇరిగేషన్ ఏ.ఈ ఆగ్రహం

నా డ్రైవర్ వాహనాన్నే నిలువరిస్తారా...మీ సంగతి చూస్తా... పోలీసు సిబ్బందిపై ఇరిగేషన్ ఏ.ఈ ఆగ్రహం


వింజమూరు, మే 2 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నా డ్రైవర్ వాహనాన్నే నిలువరిస్తారా...10 నిమిషాలు ఆగండి, మీ సంగతి చూస్తా, నేనేంటో చూపిస్తానంటూ భాధ్యతాయుతమైన మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగి పోలీస్ సిబ్బందిని హెచ్చరించిన సంఘటన వింజమూరులో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలలోకి వెళితే వింజమూరులోని బంగ్లాసెంటర్ కూడలిలో కరోనా వైరస్ నివారణా చర్యలలో భాగంగా స్థానిక పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సుమారు రాత్రి 8:30 గంటల సమయంలో కలిగిరి ఇరిగేషన్ శాఖ ఏ.ఈ డ్రైవర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా బంగ్లాసెంటర్ వద్ద పోలీసులు తమ తనిఖీలలో భాగంగా ఎక్కడ నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ నేను కలిగిరి ఇరిగేషన్ ఏ.ఈ డ్రైవర్ గా ఉంటున్నానని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో పాటు ఏ.ఈ రమేష్ కు ఫోన్ చేశారు. అదే సందర్భంలో అటుగా వెళుతున్న ఎస్.ఐ బాజిరెడ్డి గమనించి అక్కడకు చేరుకుని ఏంటని అడిగారు. అంతలో హుటాహుటిన ద్విచక్ర వాహనంపై నేరుగా ఇరిగేషన్ ఏ.ఈ బంగ్లాసెంటర్ కు చేరుకున్నారు. అంతలో ఎస్.ఐ మీరెవరండీ అని ప్రశ్నించే లోగా నీ దగ్గరకే వస్తున్నా ఉండండి  నేనేంటో చూపిస్తానంటూ సెల్ ఫోన్ చేతబట్టుకుని ఎవరివరికో ఫోన్లు చేయడం ప్రారంభించారు. అనంతరం ఎస్.ఐ బాజిరెడ్డి వద్ద కొంతసేపు హల్ చల్ చేశారు. ఇందంతా ఓపిగ్గా గమనించిన ఎస్.ఐ అసలు మీరు ఎవరండీ అని సున్నితంగా ప్రశ్నిచగా నేను ఇరిగేషన్ ఏ.ఈ ని అంటూ సమాధానమిచ్చారు. ఐడెంటిటీ కార్డును చూపించారు. ఎస్.ఐ మాట్లాడుతూ మీరు భాధ్యతాయుతమైన మండల స్థాయి అధికారిగా ఉంటూ ఇలా మా సిబ్బందితోనూ, నాతో సైతం నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం సబబు కాదన్నారు. మీకు అరగంట టైం ఇస్తున్నాను, మీరు ఎవరెవరికి 
ఫోన్లు చేసుకుంటారో చేసుకోండి, ఈ కరోనా సమయంలో మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటూ మీ కుటుంబాల రక్షణకు రాత్రింబవళ్ళు రోడ్లు వెంబడి అర్ధాకలితో పడిగాపులు కాస్తుంటే మీకు ఎగతాళిగా ఉందా అంటూ ప్రశ్నించారు. అనంతరం ఏ.ఈ డ్రైవర్ ద్విచక్ర వాహనానికి రికార్డులు చూపించకపోవడంతో నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్పటి వరకు బంగ్లాసెంటర్ వద్ద హల్ చల్ చేసిన ఏ.ఈ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పొరపాటు జరిగిందని ఎస్.ఐ ను బ్రతిమిలాడుకున్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి ఇరిగేషన్ ఏ.ఈ రమేష్ తో మాట్లాడుతూ ఈ కరోనా విపత్తు సమయంలో మీరిలా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పట్ల భాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం సరి కాదంటూ సున్నితంగా మందలించి పంపించివేశారు.