సీతారామపురంలో మద్యం విక్రయాలపై మహిళల ఆగ్రహం...

మాయదారి మద్యం మాకొద్దు బాబోయ్... జగనయ్యా మా మొర ఆలకించవయ్యా


... సీతారామపురం, మే 6 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): మాయదారి మద్యం మాకొద్దు, ఆర్ధికంగా మా కుటుంబాలు చితికిపోతున్నాయి, నీ ఇంటి ఆడపడుచుల లాంటి వాళ్ళం చెబుతున్నాం... ఈ మద్యం షాపులను మూసి వేయించయ్యా అంటూ మహిళలు నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ నిరసనకు దిగిన సంఘటన నెల్లూరుజిల్లా సరిహద్దు ప్రాంతమైన సీతారామపురంలో చోటు చేసుకుంది. గత 3 రోజుల వరకు నగరాల నుండి మారుమూల ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు వరకు కరోనా వైరస్ పుణ్యమా అని లాక్ డౌన్ విధించడంతో నివాసాలకే పరిమితమై స్వీయ నిర్భంధం పాటిస్తూ నేటికీ అదే బాటలో పయనిస్తున్నారు. లాక్ డౌన్ షరతులు మద్యం షాపులకు సైతం వర్తించడంతో గత 40 రోజులుగా మద్యం షాపులను ప్రభుత్వం బంద్ చేసింది. ఇంతలోనే ఏం కొంపలు అంటుకుపోతున్నట్లు, మద్యం లేనిదే ముద్ద దిగదన్నట్లు లాక్ డౌన్ ముగియక ముందే ఆఘమేఘాల మీద మద్యం షాపులు తీసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకేముంది మందుబాబులు మద్యం షాపుల ముందు బారులు తీరారు. ఒకేసారి అందిన కాడికి ఫూటుగా మద్యం సేవించి చిందులేయడంతో మహిళాలోకానికి చిర్రెత్తింది. ఫలితంగా మద్యం షాపులు మూసేయాలంటూ ధర్నాకు దిగారు. మీ ఆదాయం కోసం మా కుటుంబాలను పావులుగా వాడుకోవడం సబబు కాదంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నావా నాయనా అని వృద్ధులు విలపించారు. నిన్న మొన్నటి వరకు గుట్టుగా కొంపలోనే పడి వున్న తమ బిడ్డలు నేడు మద్యం సేవించి ఇళ్ళ వద్ద కోడళ్ళతో గొడవలకు దిగుతుంటే ఏ తల్లి గుండె అయినా తల్లడిల్లిపోదా అని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మద్యం ధరల పెంపుపై
 మందుబాబులు కూడా చిర్రుబుర్రులాడుతున్నారు. ఈ విధంగా రోజుకో రకంగా ధరలు  పెంచుకుంటూ పోతుండటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ధరలు పెంచితే సామాన్యులు మద్యం జోలికి పోరనేది ఒక అపోహ మాత్రమేనని పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image