కరోనాపై పోరుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, యూనిసెఫ్ మధ్య అవగాహన

కరోనాపై పోరుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, యూనిసెఫ్ మధ్య అవగాహన


యూనిసెఫ్ లేఖపై స్పందించిన గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరించందన్


 


విజయవాడ, మే 06: ఆంధ్రప్రదేశ్ లో కరోనాపై పోరుకు యూనిసెఫ్ సహకారం అందించేందుకు ముందుకు రావటం ముదావహమని, ఎపి రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పనిచేసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేయటం శుభపరిణామమని రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. యూనిసెఫ్, రెడ్ క్రాస్ సొసైటీల సంయిక్త భాగస్వామ్యం ఫలితంగా సమాజంపై కరోనా మహమ్మారి చూపుతున్న ప్రభావాన్ని సమర్ధవంతగా ఎదుర్కోవటంలో క్రియాశీలక భూమికను నిర్వహిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల నేపధ్యంలో కాలపరిమితితో కూడిన కార్యక్రమాల రూపకల్పన జరగాలన్నారు. విశ్వ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అనుమతిని మంజూరు చేయాలని యూనిసెఫ్ రాసిన లేఖకు గవర్నర్ వెంటనే స్పందించారు.


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునిసెఫ్ క్షేత్ర కార్యాలయ ముఖ్య ప్రతినిధి మీటల్ రుస్డియా రెడ్ క్రాస్ తో సంయిక్త భాగస్వామ్యాన్ని అకాంక్షిస్తూ ముందస్తుగా తమ సంసిద్ధతను వ్యక్తపరచగా, గవర్నర్ వెంటనే తదనుగుణ కార్యాచరణను వేగవంతం చేసారు. ఈ రెండు సంస్ధల భాగస్వామ్యం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.  యునిసెఫ్ ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్‌క్రాస్ వాలంటీర్ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపట్టి వారిలో సామర్ధ్య పెంపుకు దోహదం చేస్తుంది.  పిల్లల రక్షణ, నీటి వినియోగం, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యకలాపాలకు సంబంధించి పాఠశాలల స్దాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ద్వారా చిన్నారులలో రోగనిరోధకతను పెంపొందించటంతో పాటు  పిల్లల అభివృద్ధి, ఆరోగ్య అవగాహన వంటి వాటిపై లోతైన అవగాహన కల్పిస్తారు.


 శ్వాసకోశ పరమైన అంశాలపై పూర్తి స్దాయి అవగాహనకు మార్గం కల్పిస్తూ భౌతిక దూరం సాధన పై ప్రత్యేక దృష్టి నిలుపుతారు. కరోనాను ఎదుర్కోవటంలో ముందువరసలో ఉండి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంరక్షణ,  వారి వల్ల ప్రభావితమైన  వ్యక్తులు,  కుటుంబాల ప్రయోజనం కోసం కూడా ఈ రెండు సంస్ధల భాగస్వామ్యం తోడ్పడుతుందని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ కేంద్రంగా సేవలు అందిస్తున్న యునిసెఫ్ క్షేత్ర కార్యాలయ బాధ్యుడు మీటల్ రుస్డియా ఈ సంయిక్త భాగస్వామ్యం కోసం చొరవ తీసుకోవటం ప్రశంసనీయమన్నారు. తక్షణమే పూర్తి స్ధాయి రోడ్ మ్యాప్ తయారు చేసేలా గవర్నర్ బిశ్వ భూషన్ రెడ్ క్రాస్ అధ్యక్ష, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసారన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ గవర్నర్ నేతృత్వంలో ఇప్పటికే విభిన్న రకాల సేవలు అందిస్తుందని, కరోనాపై పోరులో కూడా తనదైన పాత్రను పోషించనుందని మీనా వివరించారు.