కార్మికులకు ఉపాధి కల్పిస్తాం :విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు

కార్మికులకు ఉపాధి కల్పిస్తాం
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు
వలస కార్మికులకు, వడ్లమూడి ప్రాంతంలోని వివిధ వర్గాల ప్రజలకు తమ యూనివర్సిటీలో గల వివిధ విభాగాలలో ఉపాధి కల్పిస్తామని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వడ్లమూడి ప్రాంతంలోని సుమారు 600 పేద కుటుంబాలకు, కార్మికులకు నిత్యవసర సరుకులను బుధవారం విజ్ఞాన్స్‌ సంస్థల తరుపున శ్రీకృష్ణదేవరాయలు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ వల్ల వి«ధించిన లాక్‌డౌన్‌లో పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సమీప ప్రాంత ప్రజలు పనుల కోసం ఇతరత్రా ప్రాంతాలకు వలస వెళ్లకుండా యూనివర్సిటీలో పనులు చేసుకోవాలని సూచించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకోవడంతో పాటు, వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి విజ్ఞాన్స్‌ సంస్థలు ఎప్పుడూ ముందంజలో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకూడదని, ఇంట్లో పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్‌ వీరిపైనే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించాలని తెలియజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, విజ్ఞాన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.