వింజమూరు మండలంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు:  యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ.

వింజమూరు మండలంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు:  యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ.


 వింజమూరు, మే 11 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని 12 గ్రామ పంచాయితీలు, వాటి పరిధిలోని హ్యాబిటేషన్లలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకదుర్గా భవాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పంచాయితీ పరిధిలో పలుచోట్ల జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డిని అడిగి తెలుసుకుంటూ క్షేత్ర స్థాయి లో పరిశీలనలు జరిపారు. అనంతరం యం.పి.డి.ఓ మాట్లాడుతూ మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో లక్ష్మీప్రియ ధియేటర్, దేవతా మహల్, గంగమిట్ట పరిసరాలలో ఉన్న పారుదల కాలువలలో నిల్వ ఉన్న చెత్తా చెదారమును ఇప్పటికే తొలగించడం జరిగిందన్నారు. డ్రైనేజీ కాలువలలో పారిశుద్ధ్య కార్మికులచే ఎప్పటికప్పుడు మురికిని తొలగిస్తూ బ్లీచింగ్ పౌడర్, సున్నం వేయాలని ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. అంతేగాక మండలంలోని అన్ని గ్రామ పంచాయితీలలో నివాస గృహాల సముదాయాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొనకుండా చూడాలని కార్యదర్శులకు స్పష్టం చేశామన్నారు. ఆయా గ్రామాలకు ఇప్పటికే బ్లీచింగ్ పౌడర్, సున్నం తదితరాలను సరఫరా చేశామని యం.పి.డి.ఓ తెలిపారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ ప్రభావం వింజమూరు మండలంలో లేనప్పటికీ ప్రజలు మాత్రం ఈ వైరస్ మహమ్మారిని తక్కువ అంచనాలు వేయరాదని ఆమె హెచ్చరించారు. వింజమూరు మండలం గ్రీన్ జోన్ లో ఉందిలే, ఇక ఇబ్బంది ఉండదులే అని కొంతమంది గుంపులు గుంపులుగా ఉంటున్నారని, ఇలాంటి ఘటనలు ఉహించని పరిణామాలకు దారితీసే ప్రమాదకర పరిస్థితులున్నాయన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకుంటూ వీలైనంత వరకు శానిటైజర్లును వినియోగించుకోవాలన్నారు. మండలంలో ఇప్పటికే ప్రభుత్వం  అందజేసిన మాస్కులతో పాటు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు కూడా విరివిగా మాస్కులను పంపిణీ చేస్తుండటం శుభ పరిణామమన్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు ప్రజలు స్వీయ నిర్భంధానికి పరిమితమైతేనే మేలన్నారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు వివిద పనుల నిమిత్తం ఇంటి నుండి నిత్యావసరాల కోసం వ్యాపార సముదాయాల వద్దకు రావాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించడం అత్యంత శ్రేయస్కరమన్నారు. కరోనా వైరస్ ను పూర్తిగా కట్టడి చేసే వరకు మాస్కులను విధిగా ధరించడం ప్రతి ఒక్కరూ ప్రధమ కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ప్రస్తుత సందర్భంలో అత్యంత ఆవశ్యకమని ఆమె అన్నారు. ఈ వైరస్ నివారణకు గానూ సర్వత్రా ప్రజలు అవగాహనతోనే ముందుకు సాగాలని యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ పిలుపునిచ్చారు.