టిడిపి నాయకులతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం

టిడిపి నాయకులతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ  నారా చంద్రబాబు నాయుడు సోమవారం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ నియోజకవర్గాల టిడిపి అభ్యర్ధులతో ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించారు. 
ప్రాణాలు పణంగా పెట్టి కరోనా వైరస్ పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లపై ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూలు జల్లి అభినందించడాన్ని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫ్రంట్ లైన్ వారియర్లు( డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్య కార్మికులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రైవేటు సిబ్బంది) చేస్తున్న కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇంతకన్నా రెట్టించిన స్ఫూర్తితో పనిచేసి కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేయాలని ఆకాంక్షించారు. 
ఈ సందర్భంగా చర్చించిన అంశాలు: 
1) మద్యం గుంపులతో కరోనా వైరస్ మరింత ఉధృతం: లాక్ డౌన్ తో కోట్లాది పేదలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక అల్లాడుతున్నారు. వాళ్లకు కొద్దోగొప్పో ఉపాధి కల్పించేందుకు లాక్ డౌన్ ఆంక్షలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలిస్తే అక్కడ మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణం. మద్యం దుకాణాల వద్ద పోగయ్యే గుంపులతో కరోనా వైరస్ మరింత ఉధృతమైతే దానికి వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 
2) మద్యంపై ఆదాయం ముఖ్యమా..? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా..? మద్య నిషేధం పట్ల వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. మద్యం నిషేధానికి ఇంతకన్నా మంచి సమయం ఇంకేముంటుంది..? ఆదాయం కోసం ఆరోగ్యంతో ఆడుకోవడం అమానుషం. వేరే ఆదాయ మార్గాలు అన్వేషించాలే తప్ప, ప్రజల ఆరోగ్యాన్ని పణంగాపెట్టి ఆదాయం పొందాలని చూడకూడదు. కరోనా మహమ్మారితో అల్లాడుతున్న పేదలపైకి మద్యం మహమ్మారిని వదలడం గర్హనీయం. మహిళలు నిరసనలు చేస్తున్నా మూర్ఖంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. నాసిరకం మద్యం అమ్మకాలు, మద్యం ధరల పెంపు, నాటుసారా తయారీపై నిర్లక్ష్యం వైసిపి ప్రభుత్వ చిత్తశుద్దిలేమికి ప్రత్యక్ష సాక్ష్యాలు. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని, వైరస్ వ్యాపిస్తుందని తెలిసినా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం హేయం. 
-ముడుపులిచ్చే మద్యం కంపెనీల నాసిరకం బ్రాండ్లనే అమ్ముతున్నారు. జె-ట్యాక్స్ వసూళ్ల కోసమే మద్యం ఉత్పత్తికి అనుమతులు ఇచ్చారు, మద్యం ధరలు మరోసారి 25% పెంచారు. గతంలో ఒకసారి పెంచారు, ఇప్పుడు మరోసారి పెంచారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ గత 40రోజులుగా దొడ్డిదారిన నాసిరకం మద్యం అధిక ధరలకు అమ్మకాలు జరిపి జేబులు నింపుకున్నారు. వైసిపి నాయకుల అండదండలతోనే నాటుసారా తయారీ యధేచ్చగా జరుగుతోంది.
3)పదోవంతు పంటలు కొనలేదనడానికి కోర్టులో ప్రభుత్వ అఫిడవిట్ సాక్ష్యం: పండించిన పంటలకు ధరలు లేక రైతులంతా నైరాశ్యంలో ఉన్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల కంటితుడుపు ప్రకటనలే తప్ప రైతులను ఆదుకుంది శూన్యం. మద్దతు ధరల కోసం రైతులు న్యాయ స్థానాలను ఆశ్రయించడం వైసిపి ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో వేసిన అఫిడవిట్టే అందుకు సాక్ష్యం. 
4,92,977మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నామని, మొక్కజొన్న 46,660 మె.టన్నులు, జొన్న 5,693 మె.టన్నులు, శనగ 10,872 మె.టన్నులు,కందులు 43,261 మె.టన్నులు మాత్రమే కొన్నామని కోర్టుకు తెలిపారు. ధాన్యానికి 1362కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచామని, ఇతర పంటలకు 800కేంద్రాలు పెట్టామని మొత్తంమీద 6,17,387టన్నులు మాత్రమే కొన్నట్లుగా ఒప్పుకున్నారు. పండిన పంటలో 10 వ వంతు కూడా కొనలేదని ప్రభుత్వ లెక్కలే వెల్లడించాయి. 
వాస్తవాలు ఇలా వుంటే వైసిపి నాయకులు భారీగా పంట ఉత్పత్తులు కొన్నామని సొంతమీడియాలో గప్పాలు కొట్టడాన్ని ఖండిస్తున్నాం. తెలంగాణలో ధాన్యం ఇప్పటికే 21లక్షల మెట్రిక్  టన్నులు కొనగా ఏపిలో కేవలం 4.92లక్షల టన్నులకే పరిమితం కావడం గప్పాలు కాక మరేమిటి..? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, సెరికల్చర్ ఉత్పత్తులన్నీ కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..
4) క్వారంటైన్ సెంటర్లలో వారికి రూ2వేలు పంపిణీ చేయలేదు: క్వారంటైన్ కేంద్రాల నుంచి 14రోజుల తర్వాత ఇంటికెళ్లే వారికి రూ 2వేలు అందిస్తామన్న హామీ అమలు కాలేదు. అటు ఆరోగ్యం దెబ్బతిని, ఇటు ఉపాధి కోల్పోయి నైరాశ్యంలో మునిగారు. ఈ రూ 2వేలకు అదనంగా, మరో రూ3వేలు కలిపి తక్షణమే వారందరికీ రూ 5వేలు అందజేసి ఆదుకోవాలి. 
ప్రతి ఒక్కరికి  3మాస్క్ లు పంపిణీ చేస్తామన్న మాట గాలికి వదిలేశారు. అరకొర చోట్ల ఇచ్చిన మాస్క్ లు కూడా కిరోసిన్ కంపుకొట్టేవి, విద్యార్ధుల యూనిఫామ్ క్లాత్ తో కుట్టినవి కావడంతో అక్కడే పారేసి పోతున్నారు. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున టిడిపి అందజేసిన మాస్క్ ల నాణ్యత ఎంతో బాగుంది. నాణ్యమైన మాస్క్ లు ప్రతి పేద కుటుంబానికి వెంటనే పంపిణీ చేయాలి.
 బయో మెట్రిక్ పద్దతిలో చౌక డిపోల వద్ద రేషన్ సరుకుల పంపిణీ వల్ల వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని కోరుతున్నాం.  
5)ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. భూములు మెరక చేయడం పేరుతో దోచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం భూముల సేకరణ ఒక ఉదాహరణ. గోదావరి ముంపు ప్రాంతమైన ఆవభూముల్లో పెద్ద స్కామ్ చేశారు. ఎకరం రూ 7లక్షలు చేసే భూమిని రూ 30లక్షల నుంచి రూ 60లక్షలకు కొనడం వైసిపి అవినీతికి పరాకాష్ట. మడ అడవులు కొట్టేసి మెరక చేయడంలో కూడా భారీ అవినీతికి పాల్పడ్డారు. 
ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ వైసిపి నాయకులకు ఆదాయ వనరుగా మారింది. వాస్తవ ధరకు అయిదారు రెట్లు ఎక్కువ రేట్లకు కొని వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. పేదల ఇళ్ల స్థలాల్లో కూడా వైసిపి అవినీతికి పాల్పడటాన్ని టిడిపి నాయకులు ఖండించారు.
6)కరోనాలోనూ టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు. మే డే సందర్భంగా విజయవాడలో పేద కార్మికులకు నిత్యావసరాలు పంపిణి చేసిన ఎంపి కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావుతో సహా 14మంది టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. ఉయ్యూరులో అనారోగ్యం పాలై సిఎంఆర్ ఎఫ్ అందక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్ధిక సాయం అందజేసిన ఎమ్మెల్సీ  వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఇతర టిడిపి నాయకులపై తప్పుడు కేసులు బనాయించారు. 
 ఆకలితో అలమటించే పేదలకు ఆహారం పంపిణి చేసే దాతలపై కేసులు పెట్టడం దారుణం. వైసిపి ఫ్లెక్సీలతో ట్రాక్టర్లతో ర్యాలీలు పెట్టిన, విగ్రహావిష్కరణలు, బహిరంగ సభలు జరిపిన వైసిపి నాయకులపై కేసులు లేవు. చట్టం రాష్ట్రంలో వైసిపికి చుట్టంగా మారడాన్ని ఖండించారు. తక్షణమే తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తప్పుడు కేసులు పెట్టే అధికారులపై కూడా ప్రైవేటు కేసులు వేయాలని సూచించారు. 
7) కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ ల వసూళ్లు వాయిదా వేయాలి: కరోనా కల్లోలంలో జనజీవితం అతలాకుతలం అయ్యింది. లాక్ డౌన్ కారణంగా కోట్లాది పేద కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మున్సిపాలిటి బిల్లులు చెల్లించాలని వాలంటీర్లతో ఇంటింటికి నోటీసులు పంపడం గర్హనీయం. 
కరెంటు బిల్లులు తడిసి మోపెడై అల్లాడుతున్నారు. గతనెల బిల్లు రీడింగ్ కు అదనంగా ఈ నెల రీడింగ్ కలిపి ఆ మొత్తంపై పెరిగిన  శ్లాబు ప్రకారం కరెంటు బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం దారుణం.  నీటి తీరువా పెంచాలనే ప్రతిపాదనను ఖండిస్తున్నాం. కరోనా నియంత్రణ అయ్యేదాకా అన్నిరకాల బిల్లుల వసూళ్లు వాయిదా వేయాలని కోరుతున్నాం. 
8) డయాలసిస్, తదితర రోగులకు సత్వర చికిత్స అందించాలి: నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో డయాలసిస్ కోసం తిరిగితిరిగి విసిగి పోయిన తాళ్ల రమణయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. డయాలసిసి రోగులకు వైద్యసేవల్లో ఎటువంటి లోపం చేయరాదని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా నిర్లక్ష్యం చేయడాన్ని గర్హించారు. డయాలసిస్ తో పాటు ఇతర వ్యాధుల అత్యవసర చికిత్స  నిమిత్తం వచ్చే రోగులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి.  
9) తాగునీటి ఎద్దడి నివారించాలి: వేసవిలో తాగునీటి ఎద్దడితో అనేక ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. సకాలంలో చెరువులు నింపకుండా నిర్లక్ష్యం చేశారు. వేలాది టిఎంసిల నీరు సముద్రంలోకి పోతున్నా చోద్యం చూశారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి రవాణా లేక, బోర్ వెల్స్ లో భూగర్భ జలాలు అడుగంటి, తీవ్ర దాహార్తి నెలకొంది.
 సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల దుష్ఫలితాలే ఇవన్నీ. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తాగునీటి కొరత నివారించాలి. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసి ఆదుకోవాలి. మూగ జీవాలకు పశుగ్రాస కొరత లేకుండా చూడాలి. పశుగ్రాసం, సైలేజ్, కాన్సెంట్రేట్స్ పాడి రైతులకు పంపిణి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ నియోజకవర్గాలలో పోటీచేసిన టిడిపి అభ్యర్ధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.  
                                            ----