*నందిగుంటలో ఉపాధిహామీ పనులు తనిఖీ* వింజమూరు, జూన్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ పరిసరాలలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను మంగళవారం ఉదయం యం.పి.డి.ఓ ఎస్.కనకదుర్గా భవాని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద ఉన్న మస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మస్టర్లలో నమోదు చేసి ఉన్న పేర్లు ప్రకారం కూలీల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా యం.పి.డి.ఓ మాట్లాడుతూ జాబ్ కార్డులు కలిగి ఉన్న వారినే పనులలోకి అనుమతించాలని, ఒకరికి బదులు మరొకరితో ఉపాధిహామీ పనులు చేయించిన పక్షంలో ఉపేక్షించేది లేదని ఫీల్డ్ అసిస్టెంట్లును హెచ్చరించారు. గ్రామాలలో వలసలను నివారించేందుకు గానూ అర్హులైన ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేస్తూ నూతనంగా జాబ్ కార్డులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని పనులు చేసే సమయంలో కూలీలు భౌతికదూరం పాటించాలన్నారు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని కూలీలకు విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రతను బట్టి కూలీల సం రక్షణ దిశగా ఎన్.ఆర్.ఇ.జి.యస్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలుగా శుద్ధి జలాలు, నీడను కల్పించే పట్టలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కూలీల శ్రమకు తగిన ఫలితాలనిచ్చే దిశగా ఖచ్చితమైన కొలతలను రికార్డులలో పొందుపరచాలని సిబ్బందికి సూచించారు.