*కిడ్నీల వ్యాధిగ్రస్థునికి ఆర్ధిక సాయం* వింజమూరు, జూన్ 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని జువ్విగుంటపాళెం ఎస్.టి కాలనీకి చెందిన మురళి అనే కిడ్నీల వ్యాధిగ్రస్థునికి బుధవారం సాయంత్రం జిల్లా బి.జె.పి ఉపాధ్యక్షుడు యల్లాల.రఘురామిరెడ్డి 5 వేల రూపాయల ఆర్ధిక సహాయమును అందజేశారు. మురళికి గత యేడాది క్రితం రెండు కిడ్నీలు చెడిపోవడంతో హాస్పిటల్ కు వెళ్ళి తాత్కాలికంగా వైద్యం చేయించుకున్నారు. అయితే పూర్తిగా కోలుకునేందుకు అధిక మొత్తంలో నగదు ఖర్చవుతుందని డాక్టర్లు వెల్లడించడంతో ఆర్ధిక స్థోమత లేని మురళి కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. ఈ నేపధ్యంలో మురళి కుటుంబసభ్యుల అవస్థలను తెలుసుకున్న వింజమూరు వాసి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ ఫ్రొఫెసర్ డాక్టర్ వై.వి.రామిరెడ్డి స్పందించారు. వింజమూరులోని తన సోదరుడు యల్లాల.రఘురామిరెడ్డి ద్వారా బాధిత కుటుంబానికి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రఘురామిరెడ్డి వెంట మండల బి.జె.పి టెక్నికల్ కమిటీ కన్వీనర్ మూల.బాలక్రిష్ణారెడ్డి ఉన్నారు.