ప్రతిరోజూ గంటపాటు విద్యుద్దీపాలను ఆపివేస్తాం : సుంకర పద్మశ్రీ విజయవాడ : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న ఆనాలోచిత, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టిందని ఏపీసీసీ సమన్వయ కమిటి సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. సీఆర్డీఏ రద్దు మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదంపై సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల జీవితాల్లో చీకటి నింపినందుకు ప్రతిరోజు గ్రామాలలో గంటపాటు విద్యుద్దీపాలని ఆపేయాలని నిర్ణయించుకున్నామన్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో విద్యుత్ దీపాలు ఆపివేస్తామని పద్మశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద నుంచి అసెంబ్లీకి వెళ్లే దారి మొత్తం కూడా నల్ల జెండాలను కట్టి నిరసన తెలియజేస్తామన్నారు. కరోనా కారణంగా 60 రోజుల నుంచి ఆగామని.. రేపటి నుంచి అమరావతి జేఏసీ మహిళల మందరం కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే దాకా ఉద్యమం తీవ్రతరం చేస్తామని సుంకర పద్మశ్రీ తెలిపారు.