*తాగు,సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేయాలి* పి.సి.సి సభ్యులు మద్దూరి.రాజగోపాల్ రెడ్డి.... వింజమూరు, జూలై 12 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలో తాగు, సాగునీటి వనరుల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మద్దూరి.రాజగోపాల్ రెడ్డి కోరారు. గత 6 సంవత్సరాల నుండి నియోజకవర్గ ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగొండ, సీతారాంసాగర్ పనులు అశించిన స్థాయిలో కార్యరూపం దాల్చకపోగా తరచూ నేతల పత్రికా ప్రకటనలకే పరిమితం కావడం విచారకరమన్నారు. సాగునీటి వనరులు మృగ్యం కావడంతో రైతులు దీర్ఘకాలిక పంటల సాగుకు స్వస్తి పలికి వ్యవసాయమును వదిలిపెట్టలేక స్వల్పకాలిక పంటలైన మినుము, పెసర, మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేస్తూ కేవలం వర్షాధారంపైనే ఆధారపడి భారంగా బతుకు బండిని ముందుకు సాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. పట్టెడన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు సాగునీటి వనరులను పెంపొందించే దిశగా శాశ్వత చర్యలకు పూనుకోకపోవడం శోచనీయమన్నారు. అనాది నుండి వ్యవసాయమును నమ్ముకున్న వేలాది రైతు కుటుంబాలు ప్రస్తుత తరుణంలో వ్యవసాయ బోర్లు బిక్కమొహం వేయడంతో పంటల సాగుకు స్వస్తి పలకాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయన్నారు. వెలుగొండ, సోమశిల జలాల సాధన ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయే తప్ప గద్దెనెక్కాక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి పట్టించుకోని వైనం ఊదయగిరి ప్రాంతంలో పరిపాటిగా మారడం సహజమైందన్నారు. సాగునీటి వనరుల మాట ఎలాగున్నా తాగునీటికి సైతం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. భూగర్భజలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోవడంతో చెరువులు నెర్రెలు బారాయన్నారు. గ్రామాలలో నీటి ఎద్దడి నెలకొని ప్రజలతో పాటు పశు పక్ష్యాదులు గుక్కెడు నీటి కోసం వరుణ దేవుడి కరుణా కటాక్ష్యాలు కోరుతున్నారన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంగా ఉన్న వింజమూరులో సోమశిల హైలెవల్ కెనాల్ పనులు రికార్డులకు మాత్రమే పరిమితమయ్యాయని విమర్శించారు. 12 కిలోమీటర్ల దూరంలో ఉండి సుజల జలాలతో సమృద్ధిగా ప్రవహహిస్తున్న సోమశిల కాలువ నుండి వింజమూరు చెరువులకు నీటిని మళ్ళించడంలో జరుగుతున్న జాప్యం పాలకుల పనితీరుకు దర్పణం పడుతున్నదన్నారు. వింజమూరుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సాధన కలగానే మిగిలిపోతుందా అని రాజగోపాల్ రెడ్డి ఇటు పాలకులను, అటు జల వనరుల శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని మండలాలకు సాగు, తాగునీటి అవసరాలను అందించే వెలుగొండ, సీతారాం సాగర్, సోమశిల జలాలను సాధించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు నడుం బిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల నుండి నీటి ఉద్యమాలు ఉధృతం కాక మునుపే పాలక పక్షాలు మేలుకోవాలని మద్దూరి.రాజగోపాల్ రెడ్డి హితువు పలికారు.