పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
• Valluru Prasad Kumar
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
• Valluru Prasad Kumar
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర కార్తీక మాసంలో వచ్చే పండుగ విశిష్టత
• Valluru Prasad Kumar
బెజవాడ ఓబులురెడ్డి కొద్ది సేపటి క్రితం పరమ పదించారు.
• Valluru Prasad Kumar
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn