*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.