*కరోనా టెస్టులలో వైద్యులకు ఆసరాగా ' ఆశా 'లు* వింజమూరు, సెప్టెంబర్ 18 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారంటే చాలు చాలామంది ఆ ప్రాంతానికి ఆమడ దూరంలో ఉంటుంటారు. వైద్య ఆరోగ్యశాఖ ఏ.యన్.యం లు మినహాయించి ఆ పరిసరాలలోకి వచ్చేందుకు మిగతా శాఖల అధికారులు గానీ, సిబ్బంది కానీ ముఖం చాటేయడం జగమెరిగిన సత్యం. అయితే చాలీ చాలని జీతాలతో బతుకు బండిని భారంగా ముందుకు సాగిస్తున్న ఆశా కార్యకర్తలు మాత్రం ఏ మాత్రం వెరవక సేవలే పరమావధిగా భావించి ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా పరీక్షల నిర్వహణ సమయాలలో వైద్యులకు ఆసరాగా నిలవడం అభినందించదగిన విషయం. వింజమూరు మండలంలో కరోనా విపత్తు కాలంలో ఆశా కార్యకర్తలు విశేష సేవలు అందిస్తున్నారు. మండల ఆశా వర్కర్ల యూనియన్ సంఘం అధ్యక్షురాలు పల్లాపు.అరుణ నిత్యం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వెన్నంటి నడుస్తూ మండలంలోని 31 మంది ఆశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా అరుణ కరోనా టెస్టుల సమయాలలో పి.పి.ఇ కిట్లు ధరించి వైద్యులకు సహాయకారిణిగా ఉంటూ తనదైన ప్రత్యేక శైలిని చాటుకుంటూ పదిమందికీ ఆదర్శంగా ఉంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వింజమూరు మండలంలో ఇప్పటివరకూ 450 పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అధికశాతం మంది కరోనా బాధితులు హోం క్వారంటైన్లలో ఉంటూ చికిత్సలు పొందుతున్నారు. వారందరికీ సకాలంలో అవసరమైన మందులు పంపిణీ చేయడం నుండి వైద్య పరంగా తగు సూచనలు, సలహాలు అందించడంలో వైద్య ఆరోగ్యశాఖకు ఆశా కార్యకర్తలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమో... కరోనా వైరస్ మొదటి దశలో దాతలు విస్తృతంగా ముందుకు వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు విశేషంగా నిత్యావసర వస్తువులు సమకూర్చారు. ఆ సమయాలలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న ఆశా కార్యకర్తలకు అందిన సహాయ సహకారాలు అర కొరా మాత్రమేనని చెప్పవచ్చు. తాము చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నా దాతలు తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆశాలు ఏ మాత్రం కుంగిపోలేదు. సమాజసేవే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రభుత్వాల పరంగా తమ ప్రధమ కర్తవ్య విధులను ఒకవైపు నిర్వహిస్తూ మరోవైపు కరోనా టెస్టుల సమయాలలో వైద్యులకు బాసటగా నిలుస్తూ తమ సేవానిరతికి దర్పణం పడుతూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. అయితే తమ సేవలకు గుర్తుగా ప్రభుత్వాలు తమకు ప్రకటించిన ప్రోత్సహకాలను అందించడంతో పాటుగా తమ తమ డిమాండ్లును పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.