*వింజమూరు వై.సి.పి లో ఎవరికి వారే యమునా తీరే....! వింజమూరు, సెప్టెంబర్ 8 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేధాలు నివురు గప్పిన నిప్పులా మారాయి. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన ప్రత్యేక కార్యక్రమాలలో మాత్రం నేతలు మొక్కుబడిగా పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. ఈ పరిణామాలతో మండలంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులు-ఆరు వర్గాలు రాజ్యమేలుతున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తలచిన యువనేత వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అధికార పీఠంపై ఆసీనులైనప్పటికీ స్థానిక నేతల మధ్య నెలకొన్న అభిప్రాయ భేధాలు కార్యకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదేమో...! ఉదయగిరి శాసనసభ్యులు సైతం ఈ నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో వైఫల్యం చెందారనే గుసగుసలు క్షేత్ర స్థాయిలో రెక్కలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ప్రధమంగా మేకపాటి సోదరులకు ఆది నుండి కూడా రాజకీయ రంగంలో వెన్నుదన్నుగా నిలుస్తున్న మాజీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గణపం.బాలక్రిష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితులలో ఆయనకు శాపాలుగా మారాయి. దాదాపుగా 4 దశాబ్ధాల పాటు వింజమూరు రాజకీయాలలో మకుటం లేని మహారాజులా ఒక వెలుగు వెలిగిన ఆయన ప్రస్తుతం అధికార పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ తమ తమ వర్గీయుల పనులు మాత్రం చక్కబెట్టుకోలేక పోతున్నారు. అయితే ఆయన విలక్షణ శైలి మాత్రం నేటికీ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూనే ఉంది. వై.సి.పిలో బాలక్రిష్ణారెడ్డికి తగిన ప్రాధాన్యతను నియోజకవర్గ రాజు ఇవ్వకపోయినప్పటికీ మండలంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు వై.సి.పి తీర్ధం పుచ్చుకున్న సివిల్ ఇంజనీరు పల్లాల.కొండారెడ్డి ప్రస్తుతం వింజమూరు మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. మండల పార్టీలో రగులుతున్న వర్గాల కుంపటిని మోస్తూ ముళ్ళబాటలో పయనిస్తూ పార్టీని భారంగా ముందుకు పయనింపజేస్తున్నారు. పల్లాల.కొండారెడ్డి శ్రమను గుర్తించిన యం.యల్.ఏ మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి ఈ యేడాది మార్చి నెలలో నిర్వహించతలపెట్టిన సార్వత్రిక ఎన్నికలలో కొండారెడ్డికి పెద్దపీట వేస్తూ వై.సి.పి తరపున ఏకంగా యం.పి.పి అభ్యర్ధిగా ప్రకటించి తన రాజనీతిని చాటుకున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం వై.సి.పి అధికారంలోకి వచ్చాక యం.యల్.ఏ ఒక వర్గానికి చెందిన బలమైన నేత మాజీ జడ్.పి.టి.సి సభ్యులు తిప్పిరెడ్డి.నారపరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి వై.సి.పి మండల కన్వీనర్ పదనిని కట్టబెట్టి పార్టీ కండువాను మెడలో వేసి బంధం వేశారు. అప్పటి నుండి నారపరెడ్డి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నా ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదు. బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నప్పటికీ తనకు అధికారుల వద్ద సముచిత స్థానం ఉండటం లేదనే మనోవ్యధ ఆయనను నిరంతరం క్షోభకు గురి చేస్తూనే ఉంది. ఈ పరిణామాలతో వింజమూరులో వై.సి.పి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక సామెతలా, చుక్కాని లేని నావలా మారింది. ఇప్పటికైనా యం.యల్.ఏ మేకపాటి.చంద్రశేఖర్ రెడ్ది చొరవ తీసుకుని ఈ నేతలను ఒక్క తాటిపైకి తెస్తే తప్ప రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చాపక్రింద నీరులా విస్తరిస్తున్న అదృశ్య శక్తితో పోరాటం అసాధ్యమేనని సర్వత్రా చర్చలు ఊపందుకుంటున్నాయి.