విజయసాయిపై రాష్ట్రపతికి ఫిర్యాదు

విజయసాయిపై రాష్ట్రపతికి ఫిర్యాదు
న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేయడంపై బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరారు. జయాబచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రామకోటయ్య రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఆ పదవి లాభదాయక పదవుల కిందకు వస్తుందని భయపడి జీవోను రద్దు చేశారని అన్నారు. ఈసీ కూడా వెంటనే స్పందించాలని కోరారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా రామకోటయ్య తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేసిన ఘనత జగన్‌కే సొంతమవుతుందన్నారు. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు 151 సీట్లను ఇస్తే.. ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక విధానంతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో ఏమాత్రం అవగాహన లేకుండా మంత్రులు చేస్తున్న ప్రకటనలు.. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా పోలవరం విషయంలో పీపీ లు తప్పు అంటున్నారే తప్ప.. ఏ ఒక్కటి కూడా నిరూపించలేదని విమర్శించారు. పరిపాలన ఇవ్వడమే ప్రజలు చేసి తప్పు అని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.