గెజిట్‌ ఇవ్వకపోతే 100 రోజుల పాలన ఎక్కడ నుంచి చేశారు..?

తేది 08-09-2019

రాజధాని అంటే వోక్స్‌ వ్యాగన్‌  కాదు
గెజిట్‌ ఇవ్వకపోతే 100 రోజుల పాలన ఎక్కడ నుంచి చేశారు..?
బొత్స అనుమానాలకు డిసెంబర్‌ 30, 2014న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషనే సమాధానం
        - అనగాని సత్యప్రసాద్‌, శాసనసభ్యులు


 రాష్ట్ర ప్రజలకు పనికొచ్చేవి కూలగొట్టడం, రాష్ట్ర ప్రతిష్టను చెడగొట్టడం అన్న విధంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పోటీపడి మరీ పనిచేస్తున్నారు. వైసీపీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిసారి వ్యూహాత్మకంగా బొత్స సత్యనారాయణ ద్వారా రాజధాని అంశం తెరపైకి తెస్తున్నారు. గతంలో వరద వైఫల్యాలు, ఇప్పుడు 100 రోజుల పాలన వైఫల్యాల్ని.. ఇలా తమ తప్పుల్ని కప్పిపుచ్చే ప్రతి సందర్భంలోనూ రాజధాని గూర్చే బొత్స మాట్లాడుతున్నారు. రాజధాని అంటే బొత్స అవినీతికి భయపడి పారిపోయిన వోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ కాదన్న విషయం ఆయన గుర్తుంచుకోవాలి. రాజధానిపై ఒకసారి అవినీతి మరక, మరోసారి వరద బురద ఇలా రకరకాల ప్రకటనలు చేస్తూ చివరకు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 రాజధానిపై గెజిట్‌ ఇవ్వలేదంటున్నారు. గెజిట్‌ ఇవ్వకపోతే వైసీపీ 100 రోజుల పాలన ఎక్కడ నుంచి చేశారు..? లోటస్‌పాండ్‌ నుంచా..? లేక ఇడుపులపాయ నుంచా..?  బొత్స సమాధానం చెప్పాలి. రాజధానిపై డిసెంబర్‌ 30, 2014 నాడే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. అదే రోజు విడుదల చేసిన జీవో నెం.254లోనూ గెజిట్‌ గూర్చి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. అలాంటప్పుడు బాధ్యతాయుతమైన మంత్రి స్ధాయిలో ఉన్న బొత్స ఈ విధంగా ఎలా మాట్లాడుతారు..? రాజధానిపై మీరు చేస్తున్న దుష్ప్రచారాలతో పరిశ్రమలు తరలిపోతూ.. యువత ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపురిస్తోంది. మీ వైఖరితో 5 కోట్ల ప్రజల కలలకు గండికొడుతున్నారు. ఏదైనా కీలక అంశంపై ప్రజల్లో గందరగోళం ఉన్నప్పుడు.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పష్టమైన ప్రకటన చేయాలి. కానీ రాజధాని అమరావతి విషయంలో ఎందుకీ గందరగోళం..? విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు ప్రభుత్వం ఎందుకు జంకుతోంది..? అభివృద్ధిపై చర్చ జరగాల్సిన ఈ రోజుల్లో.. అమరావతిపై చర్చ జరుగుతుండటం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దురదృష్టకరం. 
 గత కొద్దిరోజులుగా మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. సీఎం మాట్లాడాల్సిన అంశంపై మాటిమాటికీ బొత్స సత్యనారాయణ ఎందుకు మాట్లాడుతున్నారన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. రాజధాని అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నా.. ముఖ్యమంత్రి కనీసం వివరణ ఇవ్వకపోవటం బాధాకరం. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అనే భావన ప్రజల్లో కల్గుతోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మౌనం వీడి రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకుంటే ప్రజా ఉద్యమం మొదలవుతుంది.              SD/-
          (అనగాని సత్యప్రసాద్‌) 
           రేపల్లె శాసనసభ్యులు