పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం


తేది: 04.10.2019
అమరావతి


ఇళ్ల స్థలాల విషయంలో అర్హులు అనేవారు ఏ ఒక్కరూ కూడా మిగిలి ఉండటానికి వీలులేదు


• పేదలకు, వివిధ వర్గాలవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం


• పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం


• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే


• కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా భూసర్వే


• భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు:ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ 


అమరావతి, అక్టోబర్ 4: పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతామని ఎట్టిపరిస్థితుల్లోనూ పేదలకు, వివిధ వర్గాలవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని  ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్  వెల్లడించారు.  శుక్రవారం వెలగపూడి సచివాలయం రెండవబ్లాక్ లోని సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్  మీడియాతో  మాట్లాడుతూ .... రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ళ పట్టాలు, స్వంత ఇంటి కల సాకారం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమమన్నారు. పేదలకు.. వివిధ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేశామని వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలతో సమావేశమయ్యామని వెల్లడించారు. రాష్ట్రంలోని  ఉద్యోగులకు, జర్నలిస్టులకు, ఇమామ్ లకు, ఫాస్టర్ లకు, పురోహితులకు, హైకోర్టు అడ్వకేట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సబ్ కేబినేట్ భేటీలో నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఎవరెవరికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందో ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వం కొంత మంది ఐఏఎస్ అధికారులకి ఇళ్లస్థలాలు కేటాయించిందని, తమ ప్రభుత్వం మిగిలిన  ఐఏఎస్ అధికారులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్ణయించిందని తెలియజేశారు. గతంలో ఇళ్ల స్థలాలు ఎవరెవరికి కేటాయించారు, ఇంకెంత మందికి కేటాయించాలి అన్న విషయాలకు సంబంధించి  సబ్ కేబినెట్ లో చర్చించామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసరమైన నిబంధనలను పక్కన పెడతామని... చిన్న చిన్న కారణాలతో ఇళ్ల స్థలాల లబ్దికి అనర్హులని ప్రకటించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.  ఇళ్ల స్థలాల విషయమై సంబంధిత శాఖల నుంచి సమాచారం సేకరించిన అనంతరం ఏఏ కేడర్ కి ఎంత మేర ఇళ్ల స్థలం కేటాయించాలన్న విషయంపై స్పష్టత ఇస్తామని తెలిపారు. పేదలకు మాత్రమే ఉచితంగా ఇస్తామని  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.  మొదట శాఖల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఏయే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. వివరాలు సేకరించిన అనంతరం మరో 10 రోజుల్లో సమావేశమై సంబంధిత సమాచారం తెలియజేస్తామన్నారు. మండలస్థాయిలో తహసిల్ధార్ విచారణ చేసి, అర్హుడిని గుర్తించిన పిమ్మట లబ్ధిదారున్ని ఎంపిక చేస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో అర్హులు అనేవారు ఏ ఒక్కరూ కూడా మిగిలి ఉండటానికి వీలులేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. 


రాష్ట్రంలో భూమిని రీసర్వే చేయడమే ముఖ్యమంత్రి ఆలోచన అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇప్పటికే రీసర్వే దిశగా అడుగులు వేశామని తెలిపారు. భూముల రీసర్వే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ గా తీసుకున్నారని పేర్కొన్నారు. ముందుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని కొన్ని గ్రామాల్లో రీసర్వేను ఫైలట్ ప్రాజెక్టుగా చేపడతామని తెలిపారు. భూముల రీసర్వే కోసం వాడుతున్న కార్స్(CORS) టెక్నాలజీని దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా వినియోగిస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేపట్టాలని భావిస్తున్నామని తద్వారా భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.  భూముల రీసర్వేకు అధికారులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు.  భూములను రీ-సర్వే చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో ఉన్న గ్రామ కరణం, మునుసుబు వ్యవస్థ ఉన్నప్పుడు రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకుంటూ స్పష్టంగా భూములకు సంబంధించిన రికార్డులు సిద్ధం చేసేవారని ఉపముఖ్యమంత్రి  గుర్తుచేశారు.  కానీ ఆ వ్యవస్థను రద్దు చేయడం వల్ల గత 30 సంవత్సరాల కాలంలో రికార్డ్ లన్నీ నిర్వీర్యం అయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రజల భూములను కాపాడి వారికి కూడా భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శాటిలైట్ కనెక్షన్ తో సర్వే చేస్తే అతి తక్కువ తేడాతో కచ్చితత్వంతో సర్వే వస్తుందన్న నమ్మకముందన్నారు. ఎన్నికలకు ముందే ఇందుకు సంబంధించిన టెండర్ ను పిలవడం జరిగిందని, సదరు టెండర్ ను ఏపీటీఎస్ తెరిచిందన్నారు. ఇప్పటికే నిర్ధారణ,నాణ్యత పరీక్షించడం కూడా జరిగిందన్నారు. భూ రికార్డుల సర్వే టెండర్ల ఖరారు విషయంలో  తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆరోపించారు.   వ్యతిరేకంగా వస్తున్న కొన్ని కథనాలు అవాస్తవమన్నారు. అధికారులు కష్టపడి పని చేస్తుంటే ఆరోపణలు చేయడం దారుణమన్నారు.  రీసర్వే విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సందర్భంగా భూముల రీ-సర్వేకు సంబంధించిన టెండర్ల ఫైళ్లను పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మీడియా ముందు ఉంచారు. టెండర్ల ఫైలును మీడియా ముందు పెడుతున్నామని,  అంతా పరిశీలించుకోవచ్చని, బహుశా ఫైళ్లను మీడియా ముందు పెట్టడం ఇదే తొలిసారి అనుకుంటా అని ఆయన పేర్కొన్నారు.


సర్వే డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. భూ సర్వే విషయంలో మన దేశంలోనే తొలిసారిగా  ఆంధ్రప్రదేశ్ కార్స్ టెక్నాలజీని వినియోగిస్తోందని చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం లో పైలెట్ ప్రాజెక్టుగా భూ సర్వే(రీసర్వే) చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి స్పష్టత వచ్చిందన్నారు. రీసర్వే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న సాహసోపేత నిర్ణయంగా ఆయన కొనియాడారు. కార్స్ టెక్నాలజీ వాడటం ద్వారా పొలం వైశాల్యాన్ని కచ్చితంగా చెప్పవచ్చన్నారు. కచ్చితంగా పొలం తమదే అని చెప్పడం ద్వారా రైతు సంతృప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చేపడుతున్నది ఫైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని, ఇది విజయవంతం అయితే ముందడుగు వేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్ ని రూల్ ప్రకారమే పిలిచామని , ఏపీటీఎస్‌ టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు.  దేశంలో సర్వే ఆఫ్ ఇండియా... ఎక్సాగానీ ఇండియా లిమిటెడ్ సంస్థతో మహారాష్ట్రలో 77 బేస్ స్టేషన్ లకు గానూ 16 కోట్ల 21 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో 19 కోట్లకు ఒప్పందం జరగ్గా అతి తక్కువగా 65 బేస్ స్టేషన్లను 11 కోట్ల 96 లక్షలకు ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం జరిగిందని తెలియజేశారు. సాఫ్ట్ వేర్ తో కలిపి ఈ ధరకు ఆంధ్రప్రదేశ్ ఎంవోయూ కుదుర్చుకుందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ టెక్నాలజీ విజయవంతం అయితే భవిష్యత్ లో ఏ పొలంలో ఏ పంట ఉందనే విషయాన్ని కూడా చెప్పవచ్చన్నారు. ఇదే టెక్నాలజీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వినియోగిస్తోందని అయితే ఈ సాంకేతికతను వేరే అవసరాల కోసమే వినియోగిస్తుందన్నారు. దేశంలో భూముల సర్వే కోసం ఈ టెక్నాలజీని వాడుతున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.


అంతకుముందు ఈ అంశంపై ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ లు పాల్గొన్నారు. వీరితో పాటు పురపాలక పరిపాలన కార్యదర్శి శ్యామలారావు, కార్యదర్శి ఎం. రవిచంద్ర, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, న్యాయశాఖ కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image