*23.04.2020*
*అమరావతి*
*కోవిడ్ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం*
*రాష్ట్ర వ్యాప్తంగా కొసాగుతున్న కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్*
*రాష్ట్రంలో 893 పాజిటివ్ కేసులు:*
రాష్ట్రంలో తాజాగా 80 కేసులు పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్–19 కేసుల సంఖ్య 893 కు చేరింది.
కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 234 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 195, కృష్ణా జిల్లాలో 88, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 67, వైయస్సార్ కడప జిల్లాలో 51, ప్రకాశం జిల్లాలో 50, అనంతపురం జిల్లాలో 42, పశ్చిమ గోదావరి జిల్లాలో 39, తూర్పు గోదావరి జిల్లాలో 32, విశాఖపట్నం జిల్లాలో 22 కేసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 141 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైయస్సార్ కడప జిల్లాలలో 28 మంది, కృష్ణా జిల్లాలో 25 మంది, గుంటూరు జిల్లాలో 23 మంది, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, చిత్తూరు జిల్లాలలో 11మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో 7గురు, నెల్లూరు జిల్లాలో 6గురు, కర్నూలు జిల్లాలో 4గురు, ప్రకాశం జిల్లాలో ఒకరు.. మొత్తం 141 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 725 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఇప్పటి వరకు 27 మంది చనిపోయారు. గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా, కర్నూలు జిల్లాలలో 7గురు చొప్పున, అనంతపురం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చనిపోయారు.
*కోవిడ్–19 నివారణ చర్యలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష:*
కోవిడ్–19 పరీక్షల సంఖ్య బాగా పెరిగిందన్న సీఎం.
అధికారులను అభినందించిన సీఎం.
పరీక్షల విషయంలో వెనకడుగు వద్దన్న సీఎం.
పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోవాలి : సీఎం
కాగా, నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామన్న అధికారులు.
మొత్తంగా ఇప్పటివరకూ 48,034 పరీక్షలు చేశామన్న అధికారులు.
ప్రతి మిలియన్‌కు 961 టెస్టులతో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం
రానున్న రోజుల్లో మరిన్ని పరీక్షలతో మరింత మెరుగుపడతామన్న అధికారులు.
కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని తెలిపిన అధికారులు.
నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టు కిట్స్‌తో పరీక్షలు జరుగుతాయన్న అధికారులు.
ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌తో ఇప్పటివరకూ 14,423 పరీక్షలు. 11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే.
ఈ మొత్తం పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌లు ర్యాండమ్ కిట్లలో వచ్చాయన్న అధికారులు.
వీటి నిర్ధారణ కోసం పీసీఆర్ టెస్టులకు పంపుతున్నామన్న అధికారులు
కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్ల పనితీరు బాగుందన్న అధికారులు.
జిల్లాలలో కోవిడ్–19 నివారణ చర్యలు:
*శ్రీకాకుళం జిల్లా:*
గుజరాత్‌లోని వీరావల్ హార్బర్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా విశాఖపట్టణం రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. ఆ మేరకు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశించారని ఆయన తెలిపారు. ఇంకా వారికి తక్షణ అవసరాల కోసం రూ.2 వేల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తామని చెప్పారు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన కోయరాజు ఉపాధి కోసం వెళ్లి అక్కడ మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి ఆవేదన చెందారు.
గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను ఆదుకునేందుకు ఇప్పటికే జిల్లా నుంచి ప్రత్యేక వాహనంలో అధికారులను పంపించి వారి కనీస అవసరాలు తీరుస్తున్నామని, అయినా వారంతా సొంత గ్రామాలకు వచ్చేస్తామని కోరడంతో ఈనెల 21వ తేదీన తాను ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానని మంత్రి కృష్ణదాస్ తెలిపారు. దీంతో అదే రోజు సీఎం శ్రీ వైయస్ జగన్, గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడి ఏపీ మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారని చెప్పారు.
మే 3న లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత వారిని వెనక్కు రప్పించాలని భావించినా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి దృష్ట్యా వంటనే వెనక్కి రప్పించాలని నిర్ణయించామన్నారు. శుక్రవారం సాయంత్రానికి వీరావల్‌లో బోటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆదివారం నాటికి వారు విశాఖపట్నం చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి వారిని బస్సుల్లో జిల్లాలోని క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివరించారు.
*విశాఖపట్నం జిల్లా:*
జిల్లాలో కూరగాయల మొబైల్ వాహనాలను అదనంగా పెంచాలని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. కూరగాయలు, పళ్ల కిట్ల మొబైల్ వాహనాన్ని గురువారం తాటిచెట్లపాలెం రెడ్ జోన్ ప్రాంతంలో ఆయన ప్రారంభించారు. కంటైన్‌మెంట్ జోన్‌లో ఉద్యానవన శాఖ ద్వారా ఏర్పాటు చేసిన మొబైల్ బజార్ ద్వారా అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మరిన్ని వాహనాలను అదనంగా పెంచాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. మొబైల్ బజార్ ద్వారా అక్కడి ప్రజలకు 5 కిలోల కిట్ రూ.100 కే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఆ కిట్‌లో అరటి పండ్లు–8, ఖర్భూజ–1, జామకాయ–2, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, బర్బాటి అర కిలో చొప్పున, ఆనపకాయ–1 ఉంటాయని జేసీ తెలిపారు.
కోవిడ్–19 కారణంగా లాక్ డౌన్ సమయంలో కూరగాయలు మరియు పండ్లతోటలు పండించే రెైతుకి మార్కెట్ కల్పిస్తూ కొనుగోలు చేసే ప్రజలకు తాజా కూరగాయలు మరియు పండ్లు తక్కువ ధరకు ఇంటింటికి అందించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. వినూత్న ఆలోచనతో ఉద్యాన శాఖ భార్గవ్ రైతు ఉత్పత్తి సంఘం ద్వారా 5 కిలోల కిట్‌ను రూ.100 కే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గురువారం 150 కిట్లను సరఫరా చేసినట్లు జేసీ వివరించారు.
*కృష్ణా జిల్లా:*
జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత శాంపిల్స్ 5534 పరీక్షలకు పంపగా, వాటిలో 88 పాజిటివ్‌గా తేలాయి. 3892 శాంపిల్స్ నెగటివ్‌గా రాగా, ఇంకా 1554 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 25 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో 34 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో ప్రస్తుతం 724 మందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
వలస కార్మికుల కోసం 56 శిబిరాలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు వాటిలో 4460 మంది వసతి పొందుతున్నారు. వాటిలో కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి జిల్లాకు 2443 మంది రాగా, వారిని ట్రాక్ చేసి గృహ నిర్భంధంలో ఉంచారు. వారంతా 28 రోజుల గృహ నిర్భంధం పూర్తి చేసుకున్నారు. మరోవైపు కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో 88 మంది ఆస్పత్రుల్లో చేరారు.
*చిత్తూరు జిల్లా:*
జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 73 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 11 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణభరత్ గుప్త గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో తాజాగా నమోదైన 14 పాజిటివ్ కేసుల్లో.. శ్రీకాళహస్తి–5, తిరుపతి అర్బన్–1, బి.ఎన్.కండ్రిగ–1, ఏర్పేడు–1, వరదయ్యపాలెం–1, పుత్తూరు–1, చిన్నగొట్టిగల్లు–1, ఎర్రావారిపాలెం– 3 గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులుగా గల మొత్తం 73 కేసులకు సంబంధించి మండలాల వారీగా.. శ్రీకాళహస్తి–43 (డిశ్చార్జ్ –1), తిరుపతి 8 (డిశ్చార్జ్ –4), పలమనేరు–3 (డిశ్చార్జ్ –2), నగరి–4 (డిశ్చార్జ్ –1), నిండ్ర–2, బిఎన్ కండ్రిగ–1, ఏర్పేడు–2 (డిశ్చార్జ్ –1), రేణిగుంట–2 (డిశ్చార్జ్ –2), వరదయ్యపాలెం–1, పుత్తూరు–1, ఎర్రావారిపాలెం–3, చిన్నగొట్టిగల్లు–1, వడమలపేట–1, చంద్రగిరి–1 ఉన్నాయని పేర్కొన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 5,740 శ్యాంపిల్ టెస్టింగ్ చేయగా అందులో 3,894 ఫలితాలు రాగా, 1,846 ఫలితాలు అందవలసి ఉన్నదని, జిల్లా వ్యాప్తంగా 15 క్వారంటైన్ సెంటర్ల నందు 1,740 పడకలు కలవని, ఇందులో ప్రస్తుతం 414 మంది కలరని, జిల్లా వ్యాప్తంగా గల 26 రిలీఫ్ క్యాంపుల నందు ఇప్పటి వరకు 2,111 మందికి వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో మొత్తం విదేశాల నుండి వచ్చిన వారు 1,816 మంది అని, వీరందరికీ 28 రోజులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో మొత్తం హాట్ స్పాట్లు 16 కలవని, అందులో రూరల్ లో 12, అర్బన్ లో 4 కలవని తెలిపారు. జిల్లాలో రోజు వారీ శ్యాంపిల్ ల సేకరణ కార్యక్రమం జరుగుతున్నదని, ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ర్యాండమ్ గా శ్యాంపిల్ సేకరణతో పాటు రెడ్ జోన్ లలో పాజిటివ్ కేసులు వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ల వారికి కూడా వెంటనే పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని క్వారంటైన్ కు తరలించడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.
*అనంతపురం జిల్లా:*
కరోనా మహమ్మారి నుంచి ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు సంపూర్ణంగా కోలుకోవడం సంతోషం కలిగిస్తోందని.. కరోనాపై పోరాడి ఇంటికి వెళ్తున్న వారి మనోధైర్యానికి ధన్యవాదాలు అని.. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు కోలుకోవడంతో జిల్లా యంత్రాంగానికి వెయ్యేనుగుల బలం వచ్చిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం నగరంలోని జిల్లా కోవిడ్ 19 ఆస్పత్రి అయిన కిమ్స్ సవేరా నుంచి ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్స్‌లు కరోనా వైరస్ నుంచి సంపూర్ణంగా కోలుకొని జిల్లా కలెక్టర్ సమక్షంలో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11కు చేరింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ పై పోరాటం చేసి విజయం సాధించిన ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్స్‌లకు అభినందనలు తెలిపారు. వారు ఇంటికి వెళ్ళాక 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండాలని సూచించారు. డిశ్చార్జ్ అయిన డాక్టర్లు, స్టాఫ్ నర్స్‌ల కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కేంద్రాల నుంచి డిశ్చార్జ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఇంతకుముందే ఒకసారి ఇద్దరు, మరో సారి 5 గురు డిశ్చార్జి కాగా, గురువారం డిశ్చార్జ్ అయిన నలుగురితో మొత్తం 11 మంది కరోనా వైరస్ నుంచి సంపూర్ణంగా కోలుకొని వారి స్వగృహానికి వెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి రక్షణగా, వారిని సురక్షితంగా ఉంచేలా జిల్లా యంత్రాంగం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా వైరస్ గురించి బయటపడేందుకు డాక్టర్లకు సంపూర్ణ సహకారం అందించిన ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులకు ధన్యవాదాలు తెలిపారు. అత్యవసర సమయంలో నిరంతరం కష్టపడుతున్న సవేరా డాక్టర్లకు, ఉదారంగా ఆస్పత్రిని అందించిన యాజమాన్యానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.
*వైయస్సార్ కడప జిల్లా:*
జిల్లా కేంద్రంలో వంద మంది ఇండిపెండెన్స్ పాస్టర్లకు ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి.అంజాద్ బాషా గురువారం తన నివాసంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల గత 40 రోజులుగా లాక్ డౌన్ నిర్వహించడం జరిగిందన్నారు. దీంతో పట్టణంలోని పాస్టర్ లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్ల పాస్టర్లు అందరినీ పిలిపించి వారికి నిత్యవసర వస్తువులు అందజేయడం జరిగిందన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా అత్యవసర పరిస్థితులలో తప్ప ఎవరు బయటకు రాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ చర్చిల పాస్టర్‌లు పాల్గొన్నారు.
*కర్నూలు జిల్లా:*
జిల్లాలో కోవిడ్–19 కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడంతో, అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్య సేవలందించాలని ఆయన నిర్దేశించారు. మరోవైపు జిల్లా కేంద్ర ఆస్పత్రిని తాత్కాలికంగా రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చామని, అక్కడ 60 ఏళ్లకు పైబడి కరోనా సోకిన వారికి చికిత్స చేస్తామని కలెక్టర్ జి.వీరపాండియన్ వెల్లడించారు.
ప్రస్తుతం ఆ ఆస్పత్రి (రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రి) లో 27 వెంటిలేటర్లు ఉండగా, శాంతిరామ్ ఆస్పత్రి నుంచి మరో 20 వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తే, 100 వెంటిలేటర్లతో పాటు, వైద్య నిపుణుల అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు దీనిపై దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నానికి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.