ఊపిరి పీల్చుకున్న వింజమూరు మండల వాసులు


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): గత నాలుగు రోజుల నుండి ఎంతో ఉత్కంఠతతో వింజమూరు మండల ప్రజలు ఎదురు చూస్తున్న కరోనా రిపోర్టులు ఎట్టకేలకు నిర్ధారణ కావడంతో మండల ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల క్వారంటైన్ కు తరలించిన ఇద్దరికి కరోనా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయని ప్రభుత్వ వైధ్యాధికారి హరిక్రిష్ణ వెల్లడించారు. వివరాలలోకి వెళితే మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన సుభాషిణి, వింజమూరులోని కొత్తూరు ప్రాంతానికి చెందిన అంకిరెడ్డిలకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు వారిద్దరినీ వేర్వేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. సుభాషిణి ఇటీవల కరోనా వైరస్ బారిన పడి చెన్నైలో మృతి చెందిన సత్యనారాయణ రెడ్డి అనే వైద్యుడి దగ్గర గతంలో ట్రీట్ మెంట్ చేయించుకున్నారని, అంకిరెడ్డి మాత్రం కొండాపురం మండలం పార్లపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులతో కలిసి ప్రయాణం చేశారనే సమాచారంతో ముందు జాగ్రత్త చర్యలుగా అధికారులు వీరిద్దరినీ క్వారంటైన్ నందు ఉంచి వారి నుండి సేకరించిన నమూనాలను ల్యాబ్ లకు పంపించారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఇద్దరికీ కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు చాకలికొండ ప్రభుత్వ వైధ్యాధికారి హరిక్రిష్ణ తెలియజేశారు. కాగా వింజమూరులో ఈ 4 రోజుల వ్యవధిలో పలు రకాల పుకార్లు జోరుగా షికార్లు చేశాయి. ఇతర ప్రాంతాలలోని రెడ్ జోన్ల నుండి వచ్చిన వారిని అధికారులు క్వారంటైన్లకు తరలిస్తే చాలు వారికి పాజిటివ్ అని ఎవరికి వారే చర్చించుకుంటూ అందరిలో ఉత్కంఠభరిత వాతావరణమును కల్పిస్తున్నారు. గతంలో స్టేట్ బ్యాంక్ ప్రాంతానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ అని ఏకంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ఆ సమయంలో అతనికి నెగిటివ్ రిపోర్టులు రావడంతో ప్రజలలో భయాందోళనలు వీడాయి. మరలా ఇటీవల వరుస ఘటనలతో ప్రజలు మరొకసారి ఉలిక్కిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు ఘటనలలో నెగిటివ్ రిపోర్టులే రావడంతో వింజమూరు ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు.