మధ్యతరగతి ప్రజల పై విద్యుత్ భారం  – బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు

               Date: 12/05/2020
మధ్యతరగతి ప్రజల పై విద్యుత్ భారం  – బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.
గుంటూరు: రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నిర్వాకంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లింగ్ విదానం పై విద్యుత్ శాఖ సరైన స్పష్టత వినియోగదారులకు కల్పించలేదని తెలిపారు. కరోనా లాక్ డౌన్ అనంతరం విద్యుత్ బిల్లులు రావడంతో దిక్కుతోచని స్టితిలో మద్యతరగతి ప్రజలు ఉన్నారని, ఫిబ్రవరి నెలలో రూ.499/- లు వచ్చిన బిల్లు  మార్చి, ఏప్రిల్ నెలలలో కూడా అదే విధంగా బిల్లులు చెల్లించాలని, కరోనా నేపధ్యంలో సిబ్బంది బిల్లులు ఇవ్వరని విద్యుత్ శాఖ తెలిపిందని గుర్తుచేసారు. వినియోగదారులు అందరూ  90-95% వరకు ఆన్ లైన్ లో చెల్లించారని తెలిపారు. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు మే నెలలో విద్యుత్ బిల్లులు 500 రూపాయలకు బదులుగా 1500 రూపాయల బిల్లు చేతికి వచ్చేసరికి వినియోగదారులకు  కళ్ళు తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. మరికొంత మందికి అయితే 1500 రూపాయల వచ్చే బిల్లు 8500 రూపాయల బిల్లు చేతికి వచ్చేసరికి వినియోగదారులు ఏమిచేయాలో తెలియక అయోమయస్థితిలో ఉన్నారన్నారు.
ప్రజలు గత 50 రోజులుగా ఎలాంటి పనులు లేకుండా ఇళ్లకే పరిమితమయ్యారని, ఈ పరిస్థితిలో సామాన్యుడిపై విద్యుత్ వినియోగం పై చార్జీలు పెంచి వసూళ్ళు చేయాలన్న విద్యుత్ శాఖ తీరు పై వినియోగదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.  విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్  2020-21 కి నిర్దేశించిన రేట్లు వార్తా పత్రికలద్వారా ప్రజలకు తెలియజేశామని విద్యుత్ శాఖ చేతులు దులుపుకొంటున్నదని, దీనిపై వినియోగదారులకు అవగాహనకల్పించే పూర్తి  భాద్యత విద్యుత్ శాఖదేనన్నారు. విద్యుత్ శాఖవారు నిశబ్దంగా  బిల్లులు పెంచి సామాన్యుడిపై భారం మోపడం మంచిదికాదన్నారు. విద్యుత్ శాఖ బిల్లులు పెంచదలుచుకుంటే కరోనా లాక్ డౌన్ తరువాత పెంచితే బాగుంటుందని అన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా కరోనా లాక్ డౌన్ సందర్భముగా పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇలాంటి సందర్భములో చార్జీలు పెంచకుండా ఉండాలని, వీలుంటే కరోనా లాక్ డౌన్ అయిపోయేంతవరకు ఎలాంటి బిల్లులు వేయకుండా ఇలాంటి కష్ట కాలంలో ప్రజలకు సహకరించాలని చూచించారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ తీరుమార్చుకొని బిల్లుల విషయంలో గందరగోళం సృష్టించకుండా వినియోగదారులకు పాత టారిఫ్ ను కరోనా లాక్ డౌన్ అయిపోయేంతవరకు కొనసాగించాలని, ఆవిదంగా  వినియోగదారుల మన్ననలు పొందాలని  విద్యుత్ శాఖ వారిని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు కోరారు.