*కోవిడ్-19 పై వాలంటీర్ చే అవగాహనా సదస్సు* వింజమూరు, జూలై 12 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో మజరా గ్రామమైన బొమ్మరాజుచెరువులో కరోనా వైరస్ నియంత్రణకు గ్రామ వాలంటీర్ తెలదాల.రవి ఆదివారం సాయంత్రం గ్రామస్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ ఆదేశాలు, సూచనల మేరకు గ్రామస్థులు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గానూ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయం వద్ద నిర్వహించిన ఈ అవగాహనా సదస్సులో గ్రామంలో ప్రజలు అరుగులు మీద గుంపులు గుంపులుగా ఉండరాదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తాము గతంలో ఇంటింటికీ పంపిణీ చేసిన మాస్కులును గానీ స్వతహాగా సమకూర్చుకున్న మాస్కులను గానీ ధరించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ వీలైనంత వరకు మనిషికి మనిషికి మధ్య కొంతదూరం ఉండే విధంగా మసులుకోవడం శ్రేయస్కరమన్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలును అడ్డు పెట్టుకుంటే మంచిదన్నారు. తరచూ శానిటైజర్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత అత్యంత ఆవశ్యకమన్నారు. ఇప్పటివరకు నియంత్రణా మందు లేని ఈ వ్యాధికి ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మందు అని వాలంటీర్ రవి తెలియజేశారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నా, ఇతర కరోనా ప్రభావిత ప్రాంతాల నుండి ఎవరు వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.