సిఎం చేతుల మీదుగా జాషువా పురస్కారాల ప్రధానం

సిఎం చేతుల మీదుగా జాషువా పురస్కారాల ప్రధానం
అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య  యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
కత్తి పద్మా రావు, బోయి హైమవతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావుల ఎంపికవిజయవాడ సెప్టెంబర్ 25,(అంతిమ తీర్పు):
తెలుగు భాష పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి భాష ఉన్నతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య  యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. తెలుగు భాషా, సాహిత్య రంగాలలో కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలన్న సిఎం సూచన మేరకు మహా కవి గుర్రం జాషువా పురస్కార ప్రదానం 2019 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఈ పురస్కారం కింద రూ.50వేల నగదు బహుమతి ఉండగా సిఎం సూచనల మేరకు దానిని లక్ష రూపాయలకు పెంచామని యార్లగడ్డ వివరించారు.
విజయవాడలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతిలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మహా కవి గుర్రం జాషువా పురస్కార ప్రదానంకు ఎంపికైన సాహిత్యకారుల జాబితాను ప్రకటించారు. జాషువా పురస్కార ప్రదాన నిర్ణయ కమిటి పలుమార్లు సమవేశమై జాషువా భావజాలంలో జీవిస్తున్న నలుగురు కవులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసిందని అచార్య యార్లగడ్డ తెలిపారు. డా. కత్తి పద్మా రావు, బోయి హైమవతి,, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావు లు ప్రభుత్వ పరంగా జాషువా పురస్కారాలు అందుకుంటారన్నారు. సెప్టెంబర్ 28 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి నేతృత్వంలో మహా కవి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయని ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య  కళాక్షేత్రం ప్రాంగణంలోని జాషువ కాంస్యవిగ్రహానికి ఉదయం 9 గంటలకు పూలమాలలు వేసి అంజలి ఘటిస్తామని వివరించారు.
 అనంతరం 10 గంటలకు తాడేపల్లిలోని గౌరవ ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఎంపిక చేసిన సాహిత్యకారులకు మాన్యనీయ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన రెడ్డి  చేతులమీదుగా లక్ష రూపాయల నగదును, జ్ఞాపిక బహుకరిస్తారని అచార్య యార్లగడ్డ తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి, పురస్కార కమిటీ అధ్యక్షులు లక్ష్మీకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.