ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి చంద్రబాబు లేఖ

గౌ. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
నమస్కారాలు.
ప్రభుత్వ నిర్వహణ ఎంతో క్లిష్టమైనది, ఎన్నో సవాళ్లతో కూడిన అంశం. నిత్యం అనేక శాఖలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, అనుక్షణం అప్రమత్తత అవసరం. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో, ఎదురయ్యే అడ్డంకులను ఏవిధంగా అధిగమించాలో కుశాగ్ర బుద్దితో యోచించాలి. సకాలంలో సరైనరీతిలో స్పందించి సమర్ధమైన చర్యలు చేపట్టాలి. పరిపాలనకు అనుభవం ఎంత అక్కరకు వస్తుందో, కార్యదక్షత అంతకుమించి దోహదకారి అవుతుంది.
గత 4 నెలల మీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు, మీ అనుభవ రాహిత్యం, చేతకానితనం, ఆశ్రిత పక్షపాతంతో పాటుగా మీ మూర్ఖత్వం-కక్ష సాధింపు వైఖరే మూలకారణం..
అందుకు తాజాగా ఇంకో ఉదాహరణ ''గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక ప్రవేశ పరీక్షా నిర్వహణ-ఫలితాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలే..'' 
పంచాయితీరాజ్ శాఖ, విద్యాశాఖలకే కాదు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపిపిఎస్ సి)ల ప్రతిష్టకే మాయని మచ్చగా ఈ ప్రవేశ పరీక్ష చెడ్డపేరు తెచ్చింది. రాష్ట్ర ఇమేజిని దెబ్బతీయడమే కాదు, దాదాపు 19లక్షల మంది అభ్యర్ధులను, వారి కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. 
ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగాయి, లక్షలాది ఉద్యోగాల ఎంపిక జరిగిందికాని, మున్నెన్నడూ లేనంత అధ్వానంగా, అవినీతిమయంగా, అక్రమాలు-అవకతవకల భూయిష్టంగా ''గ్రామ సచివాలయ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలను'' నిర్వహించడం బాధాకరం.
ప్రవేశ పరీక్ష నోటిపికేషన్ జులై 26న వస్తే, సెప్టెంబర్ 1నుంచి 8వ తేది దాకా పరీక్షల ప్రక్రియ ప్రారంభించారు. 19,50,582మంది అభ్యర్ధులు 14కేటగిరీలలో పరీక్షలకు హాజరయ్యారని, మొత్తం ఉద్యోగాలు 1,26,728కిగాను 1,98,164మంది అర్హత సాధించారని, 56రోజుల వ్యవధిలోనే ఈ మొత్తాన్ని పూర్తిచేశామని ఆడంబరంగా ప్రకటించారే తప్ప వాటిలో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత అధ్వానంగా పరీక్షల నిర్వహణ ఉందో గాలికి వదిలేశారు. దాదాపు 20లక్షల మంది అభ్యర్ధుల ఆశలను పూర్తిగా వమ్ము చేసి గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రక్రియకే తీరని కళంకం తెచ్చారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.4లక్షలకు అమ్ముకున్నారనే కథనాలను మీడియాలో చూశాం.
క్వశ్చన్ పేపర్ లీకేజి అదేదో ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని, అయిన వాళ్లకు అందలాలు-కానివాళ్లకు మార్కుల కోతలు, ప్రశ్నాపత్రం టైప్ చేసిన వ్యక్తే పరీక్షలో టాపర్ గా వచ్చిందని, ఏపిపిఎస్ సిలో ఏఎస్ వో తమ్ముడికి ఒక కేటగిరిలో టాప్ ర్యాంకు, ఇంకో కేటగిరిలో 3వ ర్యాంకు వచ్చిందని, వాళ్ల బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు సాధించారనే వార్తలే క్వశ్చన్ పేపర్ లీకేజి అయ్యిందనడానికి తిరుగులేని రుజువులు. 'కీ'లో అత్యధిక మార్కులు వచ్చినవాళ్లకు ఫలితాల్లో అరకొరగా మార్కులు రావడం, హెల్ప్ లైన్ కు వందలసార్లు కాల్ చేసినా స్పందన లేదని అభ్యర్ధులే ఆరోపించడం అధ్వాన్న పరీక్షా నిర్వహణకు అద్దం పడుతున్నాయి.
ప్రశ్నాపత్రాలు ఏపిపిఎస్ సి కన్నా ముందే రిటైర్డ్ అధికారికి ఎలా చేరాయి, కమిషన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి క్వశ్చన్ పేపర్లు ఎలా అందాయి, ప్రింటర్లకు క్వశ్చన్ పేపర్ మెయిల్ ఎక్కడ నుంచి వెళ్లింది, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, వాళ్ల బంధువులకే టాప్ ర్యాంకులు దక్కడంలో మతలబు ఏమిటి, ఇందులో ఏపిపిఎస్ సి బాధ్యత ఎంత, పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, విద్యాశాఖల బాధ్యత ఎంత, మీడియాలో వస్తున్న ఈ ప్రశ్నలకు, ఉద్యోగాలు రాక నిలదీస్తున్న అభ్యర్ధులకు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.
''గ్రామ వాలంటీర్లలో 90% ఉద్యోగాలు మన కార్యకర్తలకే వచ్చాయి, నా దగ్గర వాటికి సంబంధించి లెక్కలన్నీ ఉన్నాయి, గ్రామ సచివాలయ ఉద్యోగాలు కూడా మన కార్యకర్తలకే వచ్చాయి'' అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత బాహాటంగా ప్రకటించిన వీడియో క్లిప్పింగులే ఈ పరీక్షా నిర్వహణ లోపాలకు, అక్రమాలకు ప్రబల సాక్ష్యం.
''ఇదేదో చిన్న అంశంగా ప్రభుత్వం భావిస్తోంది, ఇవాళ ఇక్కడ ఏం జరుగుతోంది, వేరే రాష్ట్రాల్లో ఇదే జరిగితే ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన పరిస్థితి చూశాం'' అని గతంలో మీరే శాసన సభ సాక్షిగా చేసిన ప్రసంగాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. జరిగిన దానికి బాధ్యత వహించి గతంలో మీ వ్యాఖ్యల ప్రకారం,  మీరే రాజీనామా చేస్తారో, లేక మీ పంచాయితీరాజ్, విద్యాశాఖ మంత్రులే రాజీనామా చేయాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. 
జరిగిన అవినీతికి-అక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలి. పారదర్శకంగా మళ్లీ పరీక్షలను నిర్వహించాలి. అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పాపానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.  
(నారా చంద్రబాబు నాయుడు)
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత