నాయకుడికి, ఈవెంట్‌ మేనేజర్‌కు తేడా అదే

నాయకుడికి, ఈవెంట్‌ మేనేజర్‌కు తేడా అదే
అమరావతి ‌: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదానికి ప్రయివేట్‌ వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హుందాగా అంగీకరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అదే టీడీపీ హయాంలో పుష్కరాల్లో 27 మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ అప్పటి సీఎం దబాయించిన విషయాన్ని గుర్తుచేశారు. నాయకుడికి, ఈవెంట్‌ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే అంటూ విజయసాయి రెడ్డి తెలిపారు. సోమవారం వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.  'పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డాడు. డ్యాం పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయి. ఎవరి కాళ్లు పట్టుకుని బయట పడాలా అని వెతుకుతున్నాడు. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది'అంటూ విజయసాయి రెడ్డి మరొక ట్వీట్‌లో చంద్రబాబు, లోకేశ్‌లను పరోక్షంగా హెచ్చరించారు. రివర్స్‌ టెండరింగ్‌, జ్యుడిషియల్‌ కమిషన్‌, అమ్మ ఒడి, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి సాహోసోపేతమైన నిర్ణయాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకుంటున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ సాహసోపేత పథకాలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. మొదటి సారి సీఎం అయిన 46 ఏళ్ల యువకుడు దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ను విజయసాయి రెడ్డి ప్రశంసించారు.