యూనిట్‌ రూ.4-90లకి కొనడం నేరమన్న ప్రభుత్వం రూ.6కు ఎలా కొంటోంది?

తేది 03-10-2019


విలేకరుల సమావేశం వివరాలు...


   విద్యుత్‌రంగపై శ్వేతపత్రం విడుదల చేయాలి


- నిరంతర విద్యుత్‌ ఉంటేనే పరిశ్రమలు వస్తాయి...అప్పుడే ఉద్యోగాలొస్తాయనే కనీస ఆలోచన రాష్ట్ర పాలకులకు లేకపోవడం దురదృష్టకరం


- యూనిట్‌ రూ.4-90లకి కొనడం నేరమన్న ప్రభుత్వం రూ.6కు ఎలా కొంటోంది?


 - శ్రీ పి.అశోక్‌బాబు


మిగులువిద్యుత్‌లో ఉన్న రాష్ట్రాన్ని చీకట్లపాలు చేసి, ఎడాపెడా కరెంట్‌కోతలు విధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తన చేతగానితనాన్ని గతప్రభుత్వాలపై మోపుతూ కాలయాపన చేస్తోందని టీడీపీనేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన  పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్‌రంగం స్థితిగతులు, ప్రభుత్వ ం అవలంభిస్తున్న విధానాలపై వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీరున్నాకూడా, విద్యుదుత్పత్తిచేయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, పల్లెల్లో రోజుకి గంటనుంచి మూడు గంటల వరకు అప్రకటిత విద్యుత్‌కోతలు విధిస్తోందన్నారు. గతప్రభుత్వం పర్యావరణహితమైన పవన, సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించి, దేశంలో ఎక్కడాలేనివిధంగా తక్కువధరకు విద్యుత్‌ లభించేలా చర్యలు తీసుకుంటే, పీపీఏ లపై సమీక్షలంటూ అత్యుత్సాహం చూపిన సర్కారు రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందని అశోక్‌బాబు మండిపడ్డారు. యూనిట్‌విద్యుత్‌ను రూ.4.90లకు కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టిన జగన్‌, ఇప్పుడురూ.6లకు కొనడానికి ఎలాసిద్ధమయ్యారని ఆయన ప్రశ్నిం చారు. పవన-సౌర విద్యుత్‌లను నిర్లక్ష్యం చేయడం, పీపీఏలపై సమీక్షల పేరుతో ప్రభుత్వం  విద్యుదుత్పత్తి సంస్థలను బెదిరించడం వల్లే రాష్ట్రంలో కరెంటుదొరకని పరిస్థితులు ఏర్పడ్డా యన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ను ఉత్పత్తి చేద్దామంటే, బొగ్గు ఉత్పత్తి కంపెనీలు సరఫరాను నిలిపివేశాయన్నారు. రాష్ట్రంలో సరాసరి విద్యుత్‌ వినియోగాన్ని, డిమాండ్‌ సరఫరాను అంచనావేయలేని అధ్వానస్థితిలో రాష్ట్ర పాలకులుండటం ప్రజల దురదృష్టమని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. బొగ్గు కావాలంటూ పొరుగురాష్ట్రాన్ని, కేంద్రాన్ని దేబిరిస్తున్న జగన్‌సర్కారు అది లభించకపోతే ఏంచేయాలనే దిశగా ఆలోచన చేయడంలేదన్నారు.  కొత్తగూడెం బొగ్గుఉత్పత్తి కేంద్రానికి, వైసీపీసర్కారు సకాలంలో బకాయిలు చెల్లించనందునే   ఆ సంస్థ బొగ్గుసరఫరా నిలిపివేసిందన్నారు. అలానే ఎన్టీపీసీలో రెండుయూనిట్లు మూత పడటం, పవన-సౌర విద్యుదుత్పత్తి నిలిచిపోవడం, ప్రభుత్వయంత్రాంగానికి విద్యుత్‌ సరఫరా డిమాండ్‌పై అవగాహనలేకపోవడం వల్ల నేడురాష్ట్రంలో 1500మెగావాట్ల వరకు  విద్యుత్‌లోటు ఏర్పడినట్లు అశోక్‌బాబు పేర్కొన్నారు. సహజంగా ఏటా విద్యుత్‌వినియోగం పెరుగుతుందని, నవంబర్‌నుంచి విద్యుత్‌వాడకం రెట్టింపవుతుందన్న ఆయన, ప్రభుత్వ అదృష్టం బాగుండి రాష్ట్రానికి పరిశ్రమలు ఏవీ రాలేదన్నారు. పరిశ్రమలు వచ్చినట్టయితే విద్యుత్‌ వినియోగం మరింత పెరిగేదని , పారిశ్రామిక అవసరాలకు సరిపడా సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులేత్తేసేదన్నారు. గ్రామసచివాలయాలు, లక్ష ఉద్యోగాలంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం, పరిశ్రమలు తీసుకురాకుండా, పారిశ్రామికరంగంలో ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగసమస్యను ఎలా పరిష్కరిస్తుందని అశోక్‌బాబు ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నీరురాకపోతే, ప్రజలకు తాగడానికి నీళ్లుకూడా ఇవ్వలేమంటూ ప్రభుత్వం ఎప్పుడో కాడికిందపడేసేదేనని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్ర ఆర్థికస్థితి మెరుగు పడాలంటే పరిశ్రమలు ఏర్పడాలని, పరిశ్రమలు రావాలంటే నిరంతర విద్యుత్‌, మానవ వనరులు అందుబాటులో ఉండాలన్న ఆలోచన ఏపీ పాలకులకు లేకపోవడం, రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అశోక్‌బాబు ఆవేదన వ్యక్తంచేశారు.