ధ్వజమెత్తిన మంత్రి కొడాలి నాని
విజయవాడ : చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తనకు పిల్లను ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని, ఎన్టీఆర్ దగ్గర పదవిని, పార్టీని లాక్కున్న నీచుడు, నికృష్టుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. దేవుడిని సైతం రాజకీయ కోణంలో చూసే వ్యక్తి చంద్రబాబు అని, మద్యం రేటు, తిరుపతి లడ్డు రేటుపైనా రాజకీయాలు చేసే దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారని దుయ్యబట్టారు. 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటo దారుణమన్నారు. మంత్రి కొడాలి నాని గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి అలిపిరి కొండవద్ద తల కొట్టుకొని క్షమాపణ చెప్పే స్థితి చంద్రబాబు తెచ్చుకున్నారని, ఆంబోతుల్లాంటి పెయిడ్ ఆర్టిస్టుల విషయంలో చంద్రబాబుకు కొదవేమీలేదన్నారు. ఐదు వేలు, పది వేలు రూపాయలు ఇస్తే ప్రెస్‌మీట్లు పెట్టే సన్నాసులు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిదించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పాతాళoలో పడేసినా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదన్నారు. రాజకీయల్లోకి రావటానికి వదినను చంపిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు అని ఆరోపించారు. 'బోండా ఉమా గతంలో అసెంబ్లీ సాక్షిగా నన్ను పాతేస్తా అన్నప్పుడు చంద్రబాబు ఏమాయ్యారు?' అని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వారని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. తిరుమలను కించపరిచినట్టు తనపై కేసులు పెట్టారన్న వార్తలు వస్తున్నాయని, తాను కేసులకు భయపడబోనని పేర్కొన్నారు. 'నేను తిరుపతికి వెళ్ళినప్పుడల్లా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటాను. చంద్రబాబు ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించుకున్నారు? తిరుమలకు ఆయన ఎన్నిసార్లు నడిచి వెళ్ళారు' అని ప్రశ్నించారు. తిరుమల విషయంలో తెలుగుదేశం, బీజేపీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, తిరుమలకు వెళ్లాలంటే బీజేపీ, టీడీపీ సభ్యత్వం ఉంటేనే, కమ్మ కులం క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటేనే వెళ్లాలన్న చందంగా ఆ పార్టీల నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేవుడు మీద నమ్మకంతోనే గుడికి వెళ్తారని తెలిపారు. తిరుమల వేంకటేశ్వరస్వామికి తండ్రీకొడుకులు పట్టువస్త్రాలు సమర్పించిన అరుదైన అదృష్టం వైఎస్ కుటుంబానికి దక్కిందని గుర్తు చేశారు. తాము వేసుకునే డ్రెస్సులపైనా టీడీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవినేని ఉమా గతంలో మంత్రిగా కన్నా చంద్రబాబు వద్ద సూట్‌కేసులు మోసే బ్రోకర్‌గా పని చేశారని విమర్శించారు. కాంట్రాక్టర్ల కమీషన్ డబ్బులు చంద్రబాబుకు, పప్పునాయుడికి ఇచ్చే బ్రోకర్‌గా ఉమా వ్యవహరించారని దుయ్యబట్టారు. స్వర్ణకారుల ఆత్మహత్యలు కూడా ఇసుక కొరత వల్లే జరిగాయని నారా లోకేష్ అనడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కొన్నిరోజులు ఆగితే కోడెల శివప్రసాదరావు కూడా ఇసుక కొరత వల్ల చనిపోయారనే విధంగా లోకేష్ తయ్యారయ్యారని, తెలుగుదేశం పార్టీని ఆయన రాజకీయ సమాధి చేస్తున్నారని విమర్శించారు.
ధ్వజమెత్తిన మంత్రి కొడాలి నాని