టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక కొరతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

--
 
 
 తేది 09-11-2019


సమావేశ వివరాలు


టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక కొరతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం


విజయవాడ నవంబర్ 9, (అంతిమతీర్పు) :


రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరతకు వ్యతిరేకంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీలు మద్ధతు తెలిపాయి. రాష్ట్రంలోని నదుల్లో పుష్కలంగా ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటోంది. గతంలో రూ.10 వేలు కూడా లేని లారీ ఇసుక ఇప్పుడు రూ. 50 వేల నుంచి రూ.లక్ష చేర్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని అసమర్థ, అవినీతి ప్రభుత్వానిదేనని రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు నేతలు పేర్కొన్నారు. కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు.


సీపీఐ నేత సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా అందిన ఇసుకను అర్ధాంతరంగా ఆపేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకొచ్చింది? గతంలో రూ.7 నుంచి రూ.8 వేలు పలికిన ఇసుక లారీ ధర ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వేలకు ఎందుకు చేరింది? సిమెంటు కంపెనీలతో బేరాలు కుదరక ఇసుకను ప్రభుత్వం నిలిపివేయడం వాస్తవం కాదా? భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన 30 లక్షల మంది కార్మికుల జీవితాల వైసీపీ నేతల స్వార్ధం కోసం బలి చేస్తున్నది వాస్తవం కాదా? 36 మంది కార్మికుల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వ అవినీతే కారణం. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేసిన రాజకీయ హత్యలేని మండిపడ్డారు.


అమరావతి సెంట్రింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు జి. బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల చుట్టూ తిరుగుతోందే తప్ప రాష్ట్ర భవిష్యత్తును పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో 86 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. లేబర్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ రూ.1200 కోట్లు ఉన్నాయి. కానీ ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించమంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుందామన్నా ట్రాక్టర్‌ ఇసుక అందడంలేదు. అమరావతితో సహా రాష్ట్రంలోని అన్ని నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇదెక్కడి దుర్మార్గం? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఇలాగే కొనసాగితే ఏపీ మరో బీహార్‌ అవుతుంది. మొన్నటి వరకు బీహార్‌ నుంచి కూలీలు ఆంధ్రప్రదేశ్‌కు పనుల కోసం వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి కూలీలు దేశ వ్యాప్తంగా వలసలు వెళ్లాల్సి వస్తోంది. ఈ దుస్థితికి  వైసీపీ ప్రభుత్వ అవినీతే కారణం.


లారీ అసోసియేషన్‌ సభ్యుడు చిట్టిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక భవనానికి శ్లాబ్‌ వేయడం చూసి నాలుగు నెలలైంది. ఎక్కడైనా ఫోటోలు, ఫ్లెక్సీల్లో కనబడుతుంటే కన్నీళ్లొస్తున్నాయి. మద్యం పాలసీ ఒక్క రోజుకూడా తేడా లేకుండా అమలు చేశారు. ఇసుక పాలసీ అమలుకు మాత్రం ఎందుకు 5 నెలల సమయం తీసుకున్నారు? ఇసుక పారదర్శకంగా అందిస్తామన్నారు. లారీలకు జీపీఎస్‌ అన్నారు. కానీ అక్రమంగా తరలిపోతున్న ఇసుక లారీ లోడ్లు మీకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు.


జనసేన నేత పోతిన వెంకటమహేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వీడియో గేమ్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు. 5 నెలల్లోనే ఇంతటి ప్రజాగ్రహానికి గురైన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రం వదలి పారిపోవడం ఖాయమన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత పోతిన రాము మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా స మస్యల కంటే ప్రజాధనాన్ని జేబుల్లో వేసుకోవడమే ముఖ్యంగా మారిపోయిందని విమర్శించారు.


సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత ఇంత తీవ్రంగా ఉన్నా మంత్రిమండలికి కనిపించదు. ముఖ్యమంత్రి వాస్తవాలను గుర్తించరు. బంగారం షాపుల్లో కావాల్సినంత బంగారం దొరుకుతుంది గానీ ఇసుక రీచ్‌లలో ట్రాక్టర్‌ ఇసుక మాత్రం దొరకడంలేదు. ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చి రైతులు, కూలీలు, కార్మికుల జీవితాల్ని తలకిందులు చేశారు. ఓట్లు వేసిన జనం అసహ్యించుకునే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిపోయారు. జనసేన లాంగ్‌మార్చ్‌ని విమర్శిస్తారు. టీడీపీ ప్రశ్నిస్తే విమర్శిస్తారు. కార్మికుల ఆత్మహత్యల్ని అవహేళన చేస్తారు. ప్రభుత్వానికి ఇంతటి అసహనం ఎందుకని నిలదీశారు.


టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఒక సమస్యపై ప్రజల నుంచి వచ్చే స్పందనే దాని తీవ్రతకు నిదర్శనం. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, నిరంకుశత్వం, చేతకానితనానికి కూలీలు బలైపోయారు. అయినా ఇసుక కొరత లేదనే చెబుతున్నారు. కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటే కాలంతీరి చనిపోయారంటారు. అదే సమయంలో రూ. 5 లక్షలు పరిహారము ప్రకటిస్తారు. అంటే కూలీల ఆత్మహత్యల్ని ప్రభుత్వం గుర్తించినట్లే కదా?  ఆత్మహత్యలు చేసుకున్నవారందరిని ఎందుకు ఆదుకోరు? నిలదీసినా, ప్రశ్నించినా నోటీసులు ఇచ్చేలా జీవో 2430 విడుదల చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి ప్రత్యక్ష నిదర్శనం.


కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత లేదు, కృతిమ కొరత మాత్రమే ఉంది. వేల లారీలు సరిహద్దు దాటుతుంటే ఎమ్మార్వో, కలెక్టర్‌ మేం ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. పోలీసులు దగ్గరుండి లారీలను సరిహద్దులు దాటిస్తున్నారు. దీనంతటికి ప్రభుత్వ పెద్దల బెదిరింపులే కారణం. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచనే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకుందామన్న పాపాన పోవడం లేదు. బాధిత కార్మికులందరికి పరిహారం అందేవరకు పోరాడుదాం. నిద్ర నటిస్తున్న ప్రభుత్వ బూజు దులుపేద్దాం.


మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజా ఉద్యమం అంటే పుచ్చలపల్లి సుందరయ్య, నీతి నిజాయితీ అంటే ఎన్టీఆర్‌, వ్యవసాయ రంగం అంటే ఎన్జీ రంగా గుర్తొచ్చినట్లు తుగ్లక్‌, హిట్లర్‌, నీరో చక్రవర్తి అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గుర్తొస్తున్నారు. ఒక క్రిమినల్‌ ఎక్కడున్నా సంపాదించడమే ధ్యేయం తప్ప ప్రజా సమస్యలు పట్టవు.  ఇసుక ఉచితంగా ఇవ్వడానికి జగన్మోహన్‌రెడ్డికి ఉన్న అభ్యంతరమేంటి? 112 వ్యవస్థలు కుప్పకూలిపోతే ఆ కూలిన బతుకుల పైనుండి వెళ్లి కాసులు ఏరుకోవాలని జగన్మోహన్‌రెడ్డి చూస్తున్నారు.


ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ ఒకప్పుడు ఉల్లిపాయల ధరలు నియంత్రించలేక ప్రభుత్వాలు కూలిపోయాయి. కానీ ఇప్పుడు కూలీల బతుకులు కూలిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం. జగన్మోహన్‌రెడ్డి ప్రజలతో మాట్లాడరు, వారి సమస్యలు వినరు, వారితో కలవరు. ఇందులో ఏ ఒక్కటి చేసినా పదవి పోతుందనే శాపం ఉన్నట్లుంది. వరదలు, తుఫాన్ల కంటే ఇసుక కొరత ఎక్కువ నస్టాన్ని మిగిల్చిందన్నారు.


మాజీ మంత్రి వర్యులు, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం పేదల ఆకలిని గుర్తించింది. అందుకే ఇసుకను ఉచితంగా అందించి అండగా నిలిచింది. కానీ జగన్మోహన్‌ రెడ్డికి పేదలు, వారి ఆకలి కేకల కంటే.. జేబులు నింపుకోవడమే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారు. సిమెంట్‌ కంపెనీల నుంచి రూ.2500 కోట్లకు బేరాలు కుదరకపోవడంతో.. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు.


తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధా మాట్లాడుతూ.. భవన కార్మికుల ఆత్మహత్యలు కలిచివేశాయి. వీరి ఆత్మహత్యల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రెస్‌ మీట్‌ సమయం చేపట్టినప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల వీడియాలో ప్లే చేసి మీడియాకు చూపిస్తున్నప్పుడు వారి పిల్లలు చూసి ఏడ్చిన సంఘటన ఇంకా కళ్ల ముందు కనపడుతూనే ఉంది. ఇసుకాసురుల భరతం పడితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది.


ఏఐటియుసి సభ్యులు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కొత్త ఇసుక పాలసీ 36 మంది కూలీలను చిదిమేసింది. కానీ కార్మికులు ఒక పని కాకపోతే మరో పని చేసుకుంటారని మంత్రులు మాట్లాడటం బాధాకరం.


ఏపీ పెయింటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కె ఎస్‌ రాజు మాట్లాడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ కూలీల ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎక్కడున్నారు? ఏం చేశారని ప్రశ్నించారు.


మాజీ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాల కమిటీ సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు కొత్తగా ఇసుక పాలసీని తీసుకువచ్చి వేల కోట్లు దోచుకుంటున్నారు. సంపదను రాష్ట్రం నుంచి తరలిస్తూ సంచులు నింపుకుంటున్నారు.    


కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్‌ సభ్యులు సదాశివరావు మాట్లాడుతూ ఒకప్పుడు ట్రాక్టర్‌ ఇసుక రూ.1500కే దొరికితే అవినీతి, దోపిడి అంటూ రాద్ధాంతం చేసిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ట్రాక్టర్‌ ఇసుక రూ.7 వేలు అయింది. దోపిడి చేస్తున్నదెవరు? దోచుకుంటూ ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నదెవరు. అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గారు 14వ తేదిన చేపట్టిన దీక్షకు కార్మిక సంఘాలన్నీ అండగా నిలుస్తాయని నేతలు పేర్కొన్నారు.


తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై పోరాట కమిటీకి వర్లా రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కింజరపు అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, బండారు సత్యనారాయణ మూర్తి, అఖిలప్రియ, నిమ్మల రామానాయుడులను ఏర్పాటు చేయడం జరిగింది.  కార్యక్రమంలో అమరావతి బిల్డింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు లీలా మహేశ్వరరావు, కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సింహాచలం, రెడ్డి శంకర్‌, సెంట్రింగ్‌ కార్మికుల సంఘం సభ్యులు పూర్ణ చంద్రరావు, పాల్గొన్నారు.