ఉపాధ్యాయులు, విద్యార్థులకు కలాం విద్యా పురస్కారాలు

నవంబరు 11, 2019
విజయవాడ


జాతీయ విద్య, అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


ఉపాధ్యాయులు, విద్యార్థులకు కలాం విద్యా పురస్కారాలు ప్రదానం చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ 


ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లిష్‌ తప్పనిసరి
అందుకే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌
జాతీయ విద్య దినోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ 
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు
ఆ తర్వాత 4 ఏళ్లలో 10వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌
తెలుగు, ఉర్దూలో ఏదో భాష సబ్జెక్ట్‌ కూడా ఉంటుంది
మౌలానా అబుల్‌ కలామ్‌ జయంతి కార్యక్రమంలో సీఎం ప్రకటన
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాము
నవంబరు 14న నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం
తొలుత 15 వేల స్కూళ్లలో అన్ని సౌకర్యాల కల్పన: సీఎం
ఉన్నత విద్యా రంగంలోనూ విప్లవాత్మక మార్పులు
ఉపాధి కల్పనకు దగ్గరగా ఉండే విధంగా సంస్కరణలు
అన్ని ఉన్నత విద్యా కోర్సులలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌
మదర్సాలకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తాం
మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌  


 ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లిష్‌ తప్పనిసరి అని, అందుకే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు, ఆ తర్వాత ఏడాది నుంచి నాలుగేళ్లలో 10వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే బోధన కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. అదే విధంగా తెలుగు, ఉర్దూలో ఏదో భాష సబ్జెక్ట్‌ కూడా తప్పనిసరిగా ఉంటుందని వెల్లడించారు. 
 రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నామని, అందుకోసం నవంబరు 14న నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తొలుత 15 వేల స్కూళ్లలో అన్ని సౌకర్యాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉన్నత విద్యా రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తామని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దగ్గరగా ఉండే విధంగా సంస్కరణలు చేపడతామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని ఉన్నత విద్యా కోర్సులలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ అమలు చేస్తామని వెల్లడించారు. మదర్సాలకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. 
 భారతరత్న డాక్టర్‌ మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ 132వ జయంతి సందర్భంగా అల్ప సంఖ్యాకవర్గాల శాఖ, విద్యా శాఖ సంయుక్తంగా సోమవారం విజయవాడలో నిర్వహించిన జాతీయ విద్య, మైనారిటీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యా రంగంలో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు సీఎం ఈ సందర్భంగా కలాం విద్యా పురస్కారాలు అందజేశారు.


కలామ్‌ సేవలు మరువరానివి
 దేశ తొలి విద్యా మంత్రిగా ఎనలేని సేవలందించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ జయంతి (నవంబరు 11)ని అప్పట్లో మహానేత వైయస్సార్‌ 2008లో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సుదీర్ఘంగా 1958 వరకు 11 ఏళ్ల పాటు దేశ తొలి విద్యా మంత్రిగా పని చేసి, ఎన్నో మంచి పనులు చేశారని, పలు విద్యా సంస్థలు ఆయన ప్రారంభించారని తెలిపారు.


కుటుంబాలకు వెలుగునిస్తాయి
 చదువుల దీపాలు కుటుంబాలకు వెలుగునిస్తాయని, పేదరికం నుంచి బయట పడాలంటే ఏకైక మార్గం మంచి విద్య మాత్రమే అని సీఎం పేర్కొన్నారు. పేదరికం పోవాలన్నా చదువు ఎంతో అవసరమని, అప్పుడే పేదరికం దూరమవుతుందని చెప్పారు. సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో పేదల గుండెచప్పుడు విన్నానని, వారి కష్టాలు స్వయంగా చూశానని గుర్తు చేశారు. 
 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యులున్నారన్న సీఎం, ఇదే సమయంలో దేశంలో అది 27 శాతం మాత్రమే అని చెప్పారు. ఈ పరిస్థితి మారాల్సి ఉందని అన్నారు. 


ఇంగ్లిష్‌ మీడియమ్‌ తప్పనిసరి
 పేద కుటుంబాల వారు తమ పిల్లలను చదివించాలనుకున్నా వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, పేదల పిల్లలు విద్యలో బాగా రాణించాలనుకుంటున్నారని, అందు కోసం వారు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవాలని కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. 
 'ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లిష్‌ తప్పనిసరి. అందుకే మన పిల్లలు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవాలని ఆరాటపడ్డాను. వారం క్రితం అందుకు సంబంధించి జీఓ జారీ చేస్తే, చాలా మంది పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబునాయుడు, ఎం.వెంకయ్యనాయుడు, పవన్‌ కళ్యాణ్‌తో పాటు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రోజూ కధనాలు రాశారు. ఒకసారి వారంతా తమ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి'.
 'అయ్యా చంద్రబాబుగారు మీ కొడుకు ఏ మీడియమ్‌లో చదివాడు? రేపు మీ మనవడు ఏ మీడియమ్‌లో చదవబోతున్నాడు? అయ్యా వెంకయ్యనాయుడు గారు మీ కొడుకు, మనవళ్లు ఏ మీడియమ్‌లో చదివారు?
అయ్యా యాక్టర్‌ పవన్‌ కళ్యాణ్‌ గారూ మీకు ముగ్గురు భార్యలు. మీకు నలుగురో అయిదుగురో పిల్లలు. మరి వాళ్లు ఏ మీడియమ్‌లో చదువుతున్నారు?' అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.


అందుకే ఈ నిర్ణయం
 మనం ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవకపోవడం వల్ల చాలా నష్టపోయామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. పిల్లలు బాగా చదువుకున్నప్పుడే పేద కుటుంబాల బతుకు మారుతుందన్న ఆయన, అందుకే ఆ దిశలో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.


నాడు–నేడు
 నవంబరు 14న ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రాష్ట్రంలో 45వేల స్కూళ్లు ఉండగా, వాటిలో 15వేల స్కూళ్లలో నాడు–నేడు అనే కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ఆయా స్కూళ్ల ప్రస్తుత ఫోటోలు తీస్తామని, వాటిని పూర్తిగా మార్చిన తర్వాత పరిస్థితిని చూపుతామని చెప్పారు.
 ప్రతి స్కూళ్లో బాత్‌రూమ్‌ల, బ్లాక్‌ బోర్డులు, ఫ్యాన్‌లు, ప్రహరీ,  మంచినీరు, లైట్లు వంటి అన్ని సౌకర్యాలు ఉండాలన్న సీఎం, నాడు–నేడు కార్యక్రమంలో మార్పు చేసే స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. 


వచ్చే ఏడాది నుంచే 
 వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియమ్‌తో పాటు, తెలుగు, ఉర్దూ ఏదో ఒక భాష సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే బోధన కొనసాగుతుందని, ఆ తర్వాత వచ్చే ఏడాది 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, అలా నాలుగేళ్లలో 10వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ తప్పనిసరి చేస్తామని వెల్లడించారు.
 ఆ విధంగా మన పిల్లలు నాలుగేళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ వంటి పరీక్షలు చక్కగా రాయగలుగుతారని చెప్పారు.


అమ్మ ఒడి
 దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ డిసెంబరు లేదా వచ్చే జనవరిలో అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నామని, పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు, వారికి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా చేతిలో పెడతానని అన్నారు. 


ఉన్నత విద్యలోనూ మార్పులు
 స్కూళ్ల దగ్గర నుంచి మొదలయ్యే విప్లవాత్మక మార్పులు ఉన్నత విద్య వరకు విస్తరిస్తామని సీఎం ప్రకటించారు. అవన్నీ కూడా ఉద్యోగాలకు దగ్గరయ్యే వి«ధంగా మార్పులు చేస్తామని, అన్ని కోర్సులలో ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్‌ అమలు చేయబోతున్నామని వెల్లడించారు.
 ఇంకా ఉన్నత విద్యలో పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేస్తామని, ఆ విద్యార్థులకు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద రూ.20 వేలు ఇస్తామని తెలిపారు.


మదర్సాలు
 మదర్సా బోర్డు ఏర్పాటు చేయమని కోరామన్న సీఎం, మదర్సాలకు కూడా అమ్మ ఒడి పథకం విస్తరిస్తామని చెప్పారు. అయితే వారు మోడ్రన్‌ విద్యతో పాటు, ఇంగ్లిష్‌ మీడియమ్‌లో కూడా విద్యను అభ్యసించాలని, అందుకు వారు ఒప్పుకుంటే అమ్మ ఒడి పథకం అక్కడ కూడా అమలు చేస్తామని ప్రకటించారు.


వైయస్సార్‌ పెళ్లికానుక 
 గతంలో పెళ్లికానుక అని చంద్రబాబునాయుడు పెట్టిన పథకం ఆగిపోయిందన్న సీఎం, ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన ఏ పథకం కూడా అమలు కాలేదని చెప్పారు. అందుకే తనకు వచ్చే ఏడాది మార్చి వరకు సమయం ఇవ్వాలని కోరారు. వైయస్సార్‌ పెళ్లికానుక అమలు చేస్తామని, రూ.50 వేలకు బదులు లక్ష రూపాయలు సహాయం చేస్తామని వెల్లడించారు.
 మసీదుల్లో మౌజమ్‌లు, మౌలానాలకు కూడా వేతనాలు పెంచుతామని, అందుకు కూడా వచ్చే ఏడాది మార్చి వరకు సమయం ఇవ్వాలని, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని, అన్నీ అమలు చేస్తామని సీఎం చెప్పారు. 
 ఉప ముఖ్యమంత్రి శ్రీ షేక్‌ బి.అంజాద్‌బాషా, విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు, పలువురు అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image