2,640 ఫిర్యాదులు పెండింగ్ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమీషనర్, కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

విజయవాడ :ఏప్రిల్ 13, (అంతిమ తీర్పు ) :                    కరోనా నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కాల్ సెంటర్ 1902 కు నేటి వరకు 16,550 ఫిర్యాదులు అందాయని వాటిలో 13,910 ఫిర్యాదులను పరిష్కరించగా ఇంకా 2,640 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమీషనర్, కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం  తెలిపారు.  కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను 40 విభాగాలుగా విభజించి, కరోనా వైరస్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ సమన్వయంతో పని చేస్తున్న 12 శాఖల్లో సంబంధిత శాఖకు ఆ ఫిర్యాదులు బదలాయిస్తారు. పరిష్కారమైన ఫిర్యాదుల సంతృప్తి స్థాయిని అంచనా వేసేందుకుగాను ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి వారి స్పందనను తెలుసుకోవడం జరుగుతుంది. కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రాగా వెంటనే సంబంధిత శాఖ ధృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతోందని ఆయన తెలిపారు.  కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇతర రాష్ట్రాలలో మృతిచెందిన సంబంధీకుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అంతరాష్ట్ర ఈ-పాస్ లు 1902 కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్నామన్నారు. ఇంకా పరిష్కరించవలసిన 2,640 ఫిర్యాధుల్లో అత్యధికం గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 1,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ప్రధానంగా తెల్లరేషన్ కార్డు ఉన్నప్పటికీ సాయం అందలేదని కొందరు, తెల్లరేషన్ కార్డు లేనికారణంగా సాయం అందలేదనే వారినుంచి ఎక్కువగా వచ్చాయని అన్నారు. ఈ కోవలోని పిర్యాధులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి వారికి తగిన న్యాయం చేయవలసిందిగా  జిల్లా, మండల బృందాలను ప్రభుత్వం ఆదేశించినట్లు కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.