మృత్యుఒడి నుంచి స్వగృహానికి చేరిన 85 ఏళ్ల వృద్ధురాలు... మరో నలుగురు

కరోనాపై పోరాటంలో ఆ ఐదుగురు విజయం సాధించారు!


: మృత్యుఒడి నుంచి స్వగృహానికి చేరిన 85 ఏళ్ల వృద్ధురాలు... మరో నలుగురు


: పాజిటివ్ నుంచి నెగిటివ్ గా నిర్ధారణ కావడంతో జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్


: హిందూపురం లోని ముక్కిడిపేట కు చెందిన ముగ్గురు, హౌసింగ్ బోర్డ్ కి చెందిన ఇద్దరు డిశ్చార్జ్


: ప్రత్యేక అంబులెన్స్ లలో హిందూపురానికి తరలింపు


: ఇప్పటివరకు జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుని ఏడు మంది డిశ్చార్జి


: సంతోషం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డాక్టర్లు, జిల్లా యంత్రాంగం


అనంతపురం, ఏప్రిల్ 21:


ప్రపంచ మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ అనే మృత్యు బడి నుంచి 85 ఏళ్ల వృద్ధురాలు, మరో నలుగురు కోలుకుని విజయం సాధించారు. హిందూపురం పట్టణంలో మొదటి బ్యాచ్ లో ఏడు మంది కరోనా వైరస్ బారిన పడగా, అందులో ఇప్పటికే ఇద్దరు డిశ్చార్జి కాగా, మంగళవారం రాత్రి 7: 15 గంటలకు కోవిడ్ 19 ఆస్పత్రి అయిన కిమ్స్ సవేరా నుంచి మరో ఐదుగురు కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ గా నిర్ధారణ కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. అందులో 85 ఏళ్ల వృద్ధురాలు కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడం విశేషం. ఒకే రోజు ఐదుగురు డిశ్చార్జి కావడంతో కరోనపై పోరులో డాక్టర్లు, జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ కృషికి ఫలితం లభిస్తోంది.. వివరాలిలా ఉన్నాయి..


జిల్లాలోని హిందూపురం పట్టణంలోని ముక్కిడిపేట కు చెందిన 36 ఏళ్ల వ్యక్తికి, 39, 32 ఏళ్ల వ్యక్తులకు, హౌసింగ్ బోర్డ్ కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలికి, 30 ఏళ్ల యువకుడు కి ఈనెల 5వ తేదీన మరియు 8 వ తేదీన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అందులో ఇంతకుముందు పాజిటివ్ అయిన ఆమె నుంచి ఆమె తల్లి అయిన వృద్ధురాలికి, ఆమె కుమారునికి, వారి డ్రైవర్ కు, వారి డ్రైవర్ తో కాంటాక్ట్ ఉన్న మరో ఇద్దరికీ వ్యాధి ప్రబలి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయమై హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడినుంచి హుటాహుటిన జిల్లా కోవిడ్ ఆస్పత్రికి తరలించి వారందరికీ మెరుగైన చికిత్స అందించారు. 24 గంటల పాటు నిరంతరం వైద్య సేవలు అందించడం వల్ల ఆ అయిదుగురు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళవారం రాత్రి వారందరినీ వారి వారి స్వగృహానికి తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లలో నగరంలోని సవేరా ఆస్పత్రి నుంచి హిందూపురం లోని ముక్కిడిపేట, హౌసింగ్ బోర్డ్ లో ఉన్న వారి ఇళ్ల కు తరలించారు. మొదటి బ్యాచ్ లో హిందూపురానికి చెందిన 7 మందికి కరోనా వైరస్ సోకగా, వారందరూ వ్యాధి బారి నుంచి కోలుకుని స్వగృహానికి చేరడం విశేషం. వారి వారి ఇళ్లలో కూడా 14 రోజులపాటు హోం ఐసోలేషన్ లోనే ఉంచేలా అన్ని ఏర్పాట్లు చేశామని అడిషనల్ డిఎంహెచ్ఓ పద్మావతి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించి నెగిటివ్గా నిర్ధారణ కావడంతో వారందరినీ ఇంటికి పంపించామని తెలిపారు.


మృతి ఒడి నుంచి స్వగృహానికి 85 ఏళ్ల వృద్ధురాలు :


కరోనా వైరస్ నుంచి వృద్ధులు కోలుకోవడం కష్టమని భావిస్తున్న తరుణంలో హిందూపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు కరోనా అనే మృత్యుఒడి నుంచి కోలుకుని స్వగృహానికి చేరడం అత్యంత విశేషం. ఈనెల 5వ తేదీన వృద్ధురాలికి కరోనా వైరస్ సోకగా, అత్యంత క్రిటికల్ పరిస్థితిలో హిందూపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి అనంతపురం కోవిడ్ ఆస్పత్రి కిమ్స్ సవేరాకు జిల్లా యంత్రాంగం తీసుకువచ్చారు. అత్యంత నిష్ణాతులైన డాక్టర్లు అహర్నిశలు కష్టపడి వైద్యం అందించారు. వృద్ధురాలి శరీరం కూడా అందుకు తగ్గట్టుగా స్పందిస్తూ వైద్యుల కృషికి ప్రాణం పోసింది. కరోనా మహమ్మారి నుంచి 85 ఏళ్ల వృద్ధురాలు కోలుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంతోషం వ్యక్తం చేస్తూ, వైద్యం చేసిన డాక్టర్లను, వైద్య శాఖ అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి దోస రెడ్డి, సవేరా ఆసుపత్రి డాక్టర్లు కిషోర్ రెడ్డి, చంద్రశేఖర్, పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.