కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు : సుధాకర్‌బాబు

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు : సుధాకర్‌బాబు
విజయవాడ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తున్నట్టు గుర్తుచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ5, ఏబీఎన్‌ రాధాకృష్ణ సంఘవిద్రోహ శక్తులని సుధాకర్‌బాబు వ్యాఖ్యానించారు. అన్యాయమైన రాతలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సుధాకర్‌బాబు విమర్శించారు. చంద్రబాబు మొదటి నుంచి దళిత ద్రోహి అని తెలిపారు. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే విమర్శలు చేయడం దారుణమని అన్నారు. దళితులు ఎన్నికల కమిషనర్‌గా ఉండకూడదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవం చేసుకుందని.. దానిని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులను అవమానించేలా నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహరించారని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన నిమ్మగడ్డ రమేష్‌పై కోర్టుకు వెళ్తామని చెప్పారు.