అత్యవసర ప్రయాణాలకు ఏపీలో పాసులు
కోవిడ్-19 ఎమర్జెన్సీ వెహికల్ పాసులు జారీ చేయనున్న పోలీసులు
విజయవాడ : కరోనా లాక్‌డౌన్‌ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. అయితే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని గుర్తు చేసింది. ప్రధానంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటివారికోసం కోవిడ్-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది. పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
అప్లయ్ చేయడం ఇలా : కోవిడ్-19 ఎమర్జెన్సీ వెహికల్ పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి పైన ఇచ్చిన వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్ చేయాలి. జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలు కింద ఇవ్వడం జరిగింది. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్/మెయిల్ ఐడీకి పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్/మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. ప్రయాణించేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని డీజీపీ కార్యాలయం వెల్లడించింది.
అత్యవసర ప్రయాణాలకు ఏపీలో పాసులు